కడుపులోంచి క్యాన్సర్ కణతి తొలగింపు
ఆర్‌వీఎంలో అరుదైన శస్త్రచికిత్స
ములుగు(గజ్వేల్): ములుగు ఆర్‌వీఎం ఆస్పత్రిలో కడుపునొప్పితో బాధపడుతున్న రోగికి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ కథనం మేరకు.. హన్మకొండ జిల్లా నడికుడ మండలం రామక్రిష్ణపురం గ్రామానికి చెందిన ఎరుకల సాంబయ్య(65) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ నయం కాలేదు. పది రోజుల కిందట సాంబయ్య ఆర్‌వీఎం ఆస్పత్రిలో చేరారు. వైద్యులు జనరల్ సర్జన్ శ్రీనివాస్, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఎంఎస్ కీర్తి, సర్కిల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సుబ్రహ్మణేశ్వర బాబు, అనెస్థీసియా వైద్యుడు వంశీకిరణ్ పరీక్షలు నిర్వహించి రోగి కడుపులో ప్యాంక్రియాటిస్ క్యాన్సర్‌తో కూడిన భారీ కణతి ఉన్నట్లు గుర్తించారు. సుమారు 10 గంటల పాటు శస్త్ర చికిత్స చేసి కణతిని విజయవంతంగా తొలగించారు. సాంబయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రుల్లో జబ్బు నయం కావడానికి రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారన్నారు. అంత ఖరీదైన చికిత్సను ఆర్‌వీఎం ఆస్పత్రి వైద్యులు ఆరోగ్యశ్రీ ద్వారా చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment