
ప్రతీ ఒక్కరు సేవాభావం కలిగి ఉండాలి
ఎంపీ సురేశ్ షెట్కార్
నారాయణఖేడ్: ప్రతీ ఒక్కరు సేవాభావాన్ని కలిగి ఉండాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ సూచించారు. ఖేడ్ శ్రీసత్యసాయి నిలయంలో సత్యసాయిబాబా 100వ జయంతిలో భాగంగా సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఆయన వృద్ధులకు చేతికర్రలు, హాస్టళ్లలో ఉంటూ పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లను అందజేశారు. సమితి సేవలనుకొనియాడారు.
వారిపై చర్యలు
తీసుకుంటాం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: నకిలీ వీడియోలతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్యారానగర్ డంప్‌యార్డ్ విషయంలో స్థానిక జేఏసీ నాయకులతో జరిగిన సమావేశంలో తాను కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ ఒక వీడియో వైరల్ కావడంపై ఆయన స్పందించారు. డంప్‌యార్డ్ విషయంలో జేఏసీ నాయకులతో మాట్లాడుతూ... పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ గుమ్మడిదల ప్రజలకు సంపూర్ణ మద్దతు అందిస్తున్నారని వారికి సూచించానని తెలిపారు. ఈ క్రమంలో తాను కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ నకిలీ వీడియోను సృష్టించి కొన్ని యూట్యూబ్ చానల్స్ ప్రచారం చేయడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ పరీక్షల్లో భాగంగా శుక్రవారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీషు పరీక్ష జరిగింది. ఈ పరీక్షలకు 18,594 మంది విద్యార్థులకు గానూ 18,071 మంది విద్యార్థులు హాజరు కాగా 523 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విభాగంలో 16,949 మందికి గానూ 16,530 మంది విద్యార్ధులు హాజరు కాగా 419 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఒకేషనల్ విభాగంలో 1,645మంది విద్యార్థులకు గానూ 1,541 మంది హాజరు కాగా 104 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
నేడు ఖేడ్‌లో
మహిళాదినోత్సవం
నారాయణఖేడ్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఖేడ్‌లోని సాయిబాబా ఫంక్షన్‌హాల్‌లో వేడుకలు నిర్వహించనున్నట్లు క్యాంపు కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉదయం 9గంటల నుంచి మహిళలకు వివిధ ఆటలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు.
ఉపాధి హామీ పనులు
కల్పించాలి
అదనపు డీఆర్‌డీవో బాల్‌రాజ్
జహీరాబాద్ టౌన్: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతీ గ్రామంలో కూలీలకు పనులు కల్పించాలని అదనపు డీఆర్‌డీవో బాలరాజ్ సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో డివిజన్ స్థాయి ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో కూలీల మొబిలైజేషన్, పనుల గుర్తింపు, నర్సరీల్లో మొక్కల పెంపకం, పశువుల షెడ్ల నిర్మాణం తదితర పనులపై ఆయన సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment