
కోటి కాంతుల కనకతార
హుస్నాబాద్‌రూరల్: అమ్మ చూపిన కిరాణా షాపు ఆలోచన ఆమె బతుకుకు బాటలు వేసింది. బడిలో నేర్చుకున్న కుట్టు పని వ్యాపారంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. ఒకప్పుడు కూటి కోసం తిప్పలు పడిన మహిళ.. ప్రస్తుతం ఏడాదికి రూ.కోటి వరకు వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. మూడు పరిశ్రమలు ఏర్పాటు చేసి 60 మంది స్వశక్తి మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. 2024 అక్టోబర్ 17న ఢిల్లీ వేదికగా కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన జాతీయ వ్యాపార సెమినార్‌కు రాష్ట్రం నుంచి ప్రతినిధిగా హాజరై ప్రసంగించింది. మహిళా దినోత్సవం సందర్భంగా ‘కనకతార’విజయగాథపై ప్రత్యేక కథనం..
స్వశక్తిలో చేరి.. మార్గదర్శిగా మారి
హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామానికి చెందిన బోయిన కనకతార 2005లో స్వశక్తి సంఘంలో చేరింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన రాజీవ్ యువశక్తి పథకంలో రూ. 2 లక్షల రుణం తీసుకొని జనరల్ స్టోర్ ఏర్పా టు చేసింది. మహిళలతో స్నేహం 2014లో సీ్త్ర శక్తి టైలరింగ్ యూనిట్‌కు పునాదులు పడేలా చేశాయి. బ్యాంకు లింకేజీల ద్వారా రూ. 4.50 లక్షలతో కుట్టు మిషన్లను కొనుగోలు చేసి 14 మందితో టైలరింగ్ ప్రారంభించింది. మరో రూ. 22 లక్షల వ్యయంతో అధునాతన కుట్టు మిషన్లను కొనుగోలు చేసి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ పిల్లల యూనిఫాం కుట్టి ఇస్తుంది. సొంత షెడ్డు నిర్మించి సంఘంలో 30 మందిని చేర్చుకొని ఒక్కొక్కరికి నెలకు రూ. 10 వేల చొప్పున ఉపాధి కల్పిస్తుంది. మూడు పరిశ్రమల్లో మొత్తం 60 మందికి పని కల్పించి ఆదర్శంగా నిలిచింది. కుట్టు పనికి తోడు పేపర్ ప్లేట్లు తయారు చేసి ఉపాధి పొందవచ్చని అధికారులు సూచించడంతో ఆ దిశగా అడుగులు వేసింది. తన కూతురు బెస్లీతో పేపర్ ప్లేట్ల పరి శ్రమను ఏర్పాటు చేయించి ప్రోత్సహించింది. రూ. 60 లక్షలతో మిషన్లు కొనుగోలు చేసింది. పరిశ్రమ కోసం రూ. 30 లక్షల వ్యయంతో భవనం నిర్మించి మహిళా శక్తిని చాటింది. 2020లో క్లాత్ బ్యాగ్స్ పరిశ్రమను సైతం నెలకొల్పింది. పీఎంఈజీపీ కింద రూ.25 లక్షలు, మరో రూ. 55 లక్షల బ్యాంకు రుణం తీసుకొని షెడ్డు నిర్మాణంతో పాటు మిషన్లను కొనుగోలు చేసి పరిశ్రమను నడుపుతోంది. రూ. 2 కోట్ల అస్తులను సృష్టించి ఏడాదికి రూ. కోటికి పైగా వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

కోటి కాంతుల కనకతార
Comments
Please login to add a commentAdd a comment