నువ్వులు.. లాభాల సిరులు | - | Sakshi
Sakshi News home page

నువ్వులు.. లాభాల సిరులు

Published Sun, Mar 9 2025 7:27 AM | Last Updated on Sun, Mar 9 2025 7:27 AM

నువ్వ

నువ్వులు.. లాభాల సిరులు

వేసవిలో ఆరుతడి కింద సాగు
● ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశాలు ● సాగుకు మొగ్గు చూపుతున్న రైతులు ● రైతులకు ఉద్యానవన శాఖ జిల్లా అధికారి అనిల్‌కుమార్‌ సూచనలు, సలహాలు

మిరుదొడ్డి(దుబ్బాక): వేసవిలో ఆరుతడి కింద సాగు చేసే నువ్వుల పంట సిరులను కురుపిస్తుంది. నువ్వుల సాగు వర్షాధారం కంటే వేసవిలోనే ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశాలు ఉండటంతో రైతులు సాగు వైపు మొగ్గు చూపిస్తున్నారు. నువ్వుల నూనెకు మార్కెట్‌నూ మంచి డిమాండ్‌ పలుకుతోంది. నువ్వుల్లో విటమిన్లు, అమైనో ఆమ్లాలు కలిగి ఉంటాయి. ఆయుర్వేద మందుల్లో నువ్వుల నుంచి లభించే నూనెను వాడుతుండటం విశేషం. తక్కువ సమయంలో, తక్కువ నీటి వనరులతో ప్రస్తుతం వేసవిలో ఏక వార్షిక పంటగా నువ్వులను సాగు చేయడం వల్ల మంచి దిగుబడులు వస్తాయని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి అనిల్‌ కుమార్‌ చెబుతున్నారు. నువ్వుల సాగుపై ఆయన రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు.

నేలలు: తేమ కలిగిన తేలికై న నేలలు అనుకూలంగా ఉంటాయి.

నేల తయారు చేసుకునే విధానం: నేలను నాలుగు సార్లు మెత్తగా దున్నుకొని రెండు సార్లు గుంటకతో చదును చేసుకోవాలి.

విత్తుకునే విధానం: ఎకరానికి రెండున్నర కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తనానికి మూడింతల ఇసుక కలుపుకొని గొర్రు సహాయంతో వచ్చే వరుసల్లో విత్తుకోవాలి.

విత్తనాల్లో రకాలు: హిమ, చందన, మాధవి, రాజేశ్వరి, శేతాతిల్‌, ఎలమంచిలి11, 17, 66, గౌరి అనే రకాలు ఉన్నాయి.

ఎరువులు వేసుకోవడం: ఎకరానికి నాలుగు టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్‌, 16 కిలోల నత్రజనిని దుక్కిలో వేసుకొని కలియ దున్నుకోవాలి. విత్తిన నెల రోజులకు కలుపు తీసిన తర్వాత 8 కిలోల నత్రజనిని వేసుకోవాలి.

నీటి తడులు: విత్తనాలను చల్లుకున్న అనంతరం నీటి తడిని ఇవ్వాలి. పూత, కాత, గింజలు కట్టే దశలో నీటి తడులను అందించాలి. విత్తిన తర్వాత 35 నుంచి 40 రోజులు, తర్వాత 65 నుంచి 70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

సస్యరక్షణ చర్యలు

రసం పీల్చే పురుగులు: ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేస్తాయి. ఆకులు దోనే ఆకారంలో వాలిపోతాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.6 మి. లీ. లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

కాయ తొలుచు పురుగులు: లేత ఆకులను గూడు కట్టి పచ్చని పదార్థాన్ని గీకి తినడం వల్ల ఆకులు ఎండిపోతాయి. పూతతో పాటు, లేత గింజలను తినడం వల్ల పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వీటి నివారణకు క్లోరిపైరిపాస్‌ 2.5 మిల్లీ లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.

కోడు ఈగ: మొగ్గలను, పూతను తినడం వల్ల తాలు కలిగిన కాయలు ఏర్పడతాయి. వీటి నివారణకు ఎసిఫేట్‌ 1 గ్రామ్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

గొంగళి పురుగులు: ఆకుల్లోని పత్రహరితాన్ని తినడం వల్ల ఆకులు జల్లెడలా మారుతాయి. మొగ్గలను, పువ్వులను, తినడంతోపాటు కాయలకు రంధ్రాలు చేసి విత్తనాలను తింటాయి. వీటి నివారణకు ఎండోసల్ఫాన్‌ 2 మిల్లీ లీటర్లు లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

తెగుళ్ల నివారణ

వేరు కుళ్లు, కాండం తెగుళ్లు: ఆకులు పసుపు వర్ణానికి మారి వేలాడుతాయి. దీని నివారణకు పంట మార్పిడి చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రామ్‌ థైరంతో విత్తన శుద్ధి చేయాలి. మాంకోజెబ్‌ 3 గ్రామ్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఆకు మచ్చ తెగులు: ఆకులు, కాండంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. దీని నివారణకు తెగులు ఆశించిన అవశేషాలను తొలగించాలి. మాంకోజెబ్‌ 2.5 గ్రాములు లీటర్‌ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేయాలి.

కాండం తెగులు: కాండంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా నల్లగా మారుతాయి. దీని నివారణకు కాఫర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రాములు లీటర్‌ నీటితో కలిపి పిచికారీ చేయాలి.

పంట కోత విధానం: ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోయే సమయంలో కాయలు లేత పసుపు వర్ణానికి మారినప్పుడు కోత కోసుకోవాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలకిందులుగా నిలబెట్టాలి. ఆరు రోజుల పాటు ఆరబెట్టుకోవాలి. కట్టెలతో కొట్టి నూర్పిడి చేసుకోవాలి.

నిల్వ చేసుకునే విధానం: గింజల్లోని తేమ 8 శాతం తగ్గే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. నిలువ ఉంచుకున్న గోనె సంచులపై మాలథియాన్‌ పొడిని చల్లుకోవాలి. విక్రయానికి మంచి ధర పలికినప్పుడు మార్కెట్‌కు తరలించి ఆర్థికాదాయాన్ని పొందాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
నువ్వులు.. లాభాల సిరులు 1
1/1

నువ్వులు.. లాభాల సిరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement