
ఒకే రోజు మామ, కోడలు మృతి
మక్కరాజీపేటలో విషాదం
చేగుంట(తూప్రాన్): ఒకే రోజు మామ, కోడలు మృతి చెందిన విషాదకర ఘటన మండలంలోని మక్కరాజీపేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మక్కరాజీపేట గ్రామంలో వారం రోజుల కిందట ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆరెల్ల సుమలత(35) పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం సుమలతను గజ్వేల్ తరలిస్తున్న క్రమంలో దౌల్తాబాద్ మండలం మాచిన్‌పల్లి శివారులో అంబులెన్స్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న సుమలత మామ ఆరెల్ల పోచయ్య(65)కు తీవ్ర గాయాలయ్యాయి. కోమాలోకి వెళ్లిన పోచయ్యను లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి, సుమలతను తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న పోచయ్య శనివారం మృతి చెందాడు. మామ మరణ వార్త విన్న సుమలత తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటు రావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఒకే కుటుంబంలో గంటల వ్యవధిలోనే మామ, కోడలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలు సుమలతకు కుమారుడు, కూతురు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment