
21 రోజులు.. రూ.39 కోట్లు
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025
● మూడు వారాల్లో నిధులుఖర్చు చేయకపోతే వెనక్కే.. ● ఆగమేఘాలపై మెటల్,సీసీ రోడ్ల పనుల మంజూరు ● ఆ వెంటనే నిర్మాణాలు... ● బిల్లులు డ్రా చేసేందుకు హడావుడి ● ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనుల తీరు
పంచాయతీల ఖాతాల్లో నిధులు
సీసీ రోడ్ల పనులు చేపట్టే బాధ్యత గ్రామ పంచాయతీలకు ఉంటుంది. ప్రస్తుతం పంచాయతీలకు పాలవర్గం లేదు. దీంతో స్పెషల్ ఆఫీసర్లు, గ్రామ కార్యదర్శులు ఈ పనులను పూర్తి చేయించాల్సి వస్తోంది. గతంలో సర్పంచులే ఈ పనులు చేసి నిధులు డ్రా చేసుకునే వారు. ఇప్పుడు వారు లేకపోవడంతో మెటీరియల్ సప్లై చేసే సంస్థల పేరుతో బిల్లులు డ్రా చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే జిల్లాకు వచ్చిన రూ. 60.40 కోట్లను జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు కేటాయించారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు చెప్పిన వారికి ఈ పనులు దక్కుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగానే ఇప్పుడు కూడా అధికార పార్టీ నేతలే ఈ పనులు చేపడుతున్నారు. హడావుడిగా చేస్తున్న ఈ పనుల్లో నాణ్యత ఏ మేరకు ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అరుణాచలం సినిమాలో నెల రోజుల్లో రూ. 30 కోట్లు ఖర్చు చేయడం అప్పట్లో పెద్ద టాస్క్‌గా ఉంటుంది. ప్రస్తుతం జిల్లాకు వచ్చిన ఉపాధి హామీ నిధుల విషయంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. కేవలం 21 రోజుల్లో (ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే 31 మార్చి లోపు) సుమారు రూ. 39 కోట్ల వ్యయం కలిగిన సీసీ రోడ్లు, మెటల్ రోడ్లు వంటి పనులు పూర్తి చేయాల్సి ఉంది. లేనిపక్షంలో జిల్లాకు వచ్చిన ఈ నిధులు వెనక్కి (ల్యాప్స్ అవుతాయి) వెళ్లిపోతాయి. దీంతో సంబంధిత శాఖల అధికారులు హడావుడి చేస్తున్నారు. పనులకు సంబంధించి ఇప్పుడు మంజూరు ఇస్తున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు తంటాలు పడుతున్నారు.
రూ. 60.40 కోట్ల నిధులు
ఉపాధి హామీ పథకంలో కూలీలు చేసిన పనిదినాలను బట్టి జిల్లాకు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు జనరేట్ అవుతాయి. ఇలా జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 60.40 కోట్లు వచ్చాయి. ఈ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కొన్నిచోట్ల మెటల్ రోడ్లు వేయనున్నారు. ఈ పనులు పూర్తి చేసేందుకు కేవలం 21 రోజులే సమయం ఉంది. ఈ రోజుల్లోనే పనులు మంజూరు చేయడంతో పాటు ప్రారంభించి పూర్తి చేయాలి. బిల్లులు రికార్డు చేసి నిధులు డ్రా చేయాలి. కానీ ఇప్పటివరకు కేవలం రూ. 21 కోట్ల మేరకు పనులు మాత్రమే మంజూరయ్యాయి. ఈ పనులు ప్రారంభించేందుకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే మిగిలిన రూ. 39.40 కోట్ల పనులను ఆఘమేఘాలపై ప్రారంభించేందుకు కృషి చేస్తున్నారు.
న్యూస్‌రీల్
ల్యాప్స్ కాకుండా చర్యలు
మెటీరియల్ కాంపోనెంట్ కింద జిల్లాకు రూ. 60.40 కోట్లు వచ్చాయి. ఇప్పటికే సుమారు 50 శాతం పనులు పూర్తి చేశాం. మార్చి 31 లోపు మిగిలిన పనులన్నీ పూర్తి చేసి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకునేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. మరికొన్నింటికి మంజూరు ఇస్తున్నాం.
– జ్యోతి, డీఆర్‌డీఓ

21 రోజులు.. రూ.39 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment