రోడ్లు అధ్వానం.. ప్రయాణం నిదానం
ఝరాసంగం(జహీరాబాద్): అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణలోపంతో ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రహదారుల నిర్వహణ అధ్వానంగా మారింది. మరమ్మతులు చేపట్టి రహదారుల నిర్వహణ చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో మండల అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఫలితంగా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పలువురు మృత్యువాత పడటంతోపాటు మరికొందరు గాయాల పాలవుతున్నారు. జహీరాబాద్ పట్టణానికి నిత్యం వేలాదిమంది అందోల్ నియోజకవర్గంలోని పలు మండలాలతో ఝరాసంగం మండల ప్రజలు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు.
బ్రిడ్జిల వద్ద కోతలు, కనిపించని సూచిక బోర్డులు
జహీరాబాద్ నియోజకవర్గం పస్తాపూర్ నుంచి ఝరాసంగం మండల పరిధిలోని కప్పాడ్ వరకు సుమారు 20 వరకు బ్రిడ్జిలు ఉంటాయి. కొన్నిచోట్ల బ్రిడ్జి గోడలు కూలిపోయి ఉన్నాయి. మరికొన్నిచోట్ల కోతకు గురయ్యి ప్రమాదకరంగా మారాయి. చాలాచోట్ల బ్రిడ్జిల చుట్టూ పిచ్చి మొక్కలు నిలిచి సూచిక బోర్డులు కనిపించడం లేదు. మండలంలోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. మరమ్మతులు చేపట్టాలని ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప కార్యాచరణకు నోచుకోవడంలేదు. ఇక రోడ్లకిరువైపులా ఏపుగా పెరిగిన చెట్లవల్ల రాత్రి సమయాల్లో ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా మూలమలుపుల వద్ద ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు నేలకు ఒరిగి దారిని చూపలేకపోతున్నాయి.
నిర్వహణను గాలికొదిలిన అధికారులు
ప్రధాన రహదారులతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్ల నిర్వహణ కూడా అధ్వానంగా మారింది. పిచ్చి మొక్కలను తొలగించాలని పలువురు కోరుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
స్థానికులు ఆగ్రహం...
ప్రతి సంవత్సరం ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు జరుగుతాయి. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తుంటారు. ఆలయానికి వచ్చే దారులు మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినా బేఖాతరు చేశారని, కనీసం ఒక్క పని కూడా చేపట్టలేకపోయారని అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని, రహదారుల నిర్వహణ చేపట్టాలని కోరుతున్నారు.
బ్రిడ్జిల వద్ద కూలిన గోడలు
రోడ్డుకిరువైపులా పిచ్చిగడ్డి
మరమ్మతులకు నోచుకోని రహదారులు
అధికారుల ఆదేశాలు బేఖాతరు
ఏళ్లు గడుస్తున్నా అదే తీరు
రోడ్లు అధ్వానం.. ప్రయాణం నిదానం
Comments
Please login to add a commentAdd a comment