కలగానే ఆలు పరిశోధన కేంద్రం
● సంగారెడ్డిలో ఏర్పాటు చేయాలని దశాబ్దం క్రితం ప్రతిపాదన ● రూ.1.57 కోట్లతో అంచనాలు ● ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ప్రతిపాదనలు బుట్టదాఖలు ● విత్తనం కోసం పక్క రాష్ట్రాలకు రైతుల పరుగు ● అధిక శాతం దళారులపైనే ఆధారం ● నాసిరకం విత్తనంతో నష్టాల్లో కూరుకుపోతున్న రైతాంగం
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లాలో బంగాళదుంప(ఆలుగడ్డ) పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని దశాబ్ద కాలం క్రితం ప్రతిపాదించినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 2012–13 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని సంగారెడ్డిలో డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉద్యాన పరిశోధన కేంద్రానికి అనుబంధంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి బంగాళదుంప పరిశోధనా కేంద్రం అప్పటి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం పరిశీలించింది. సైంటిస్టులు సైతం అన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే ఆలుగడ్డ పరిశోధన కేంద్రం ఉంది. సంగారెడ్డిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే తెలుగు రాష్ట్రాల్లోనే ఇది మొదటి కేంద్రం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆలుగడ్డ పంటను సాగుచేస్తుంటారు. ప్రతి సీజన్‌లో ఆలుగడ్డ పంటను సాగుచేసే ముందు రైతులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, పంజాబ్‌లోని జలంధర్‌లతో పాటు గుజరాత్ రాష్ట్రాల నుంచి విత్తనం తెచ్చుకోవాల్సి వస్తోంది. తద్వారా రైతులపై ఆర్థిక భారం పడుతోంది. దీనికి తోడు తమ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులకు అనువైన బంగాళదుంప రకాలు లభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆలుగడ్డ సాగు చేసే రైతులకు ప్రయోజనకరంగా ఉండేందుకు ఆల్ ఇండియా కో–ఆర్డినేటెడ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రాజెక్టు(ఆక్రిప్) ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని వైఎస్‌ఆర్ ఉద్యాన పరిశోధన కేంద్రానికి అనుబంధంగా ఆలు పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అప్పట్లో ప్రతిపాదించారు. ఇందుకు రూ.1.57 కోట్లతో సంగారెడ్డిలో ఆలు పరిశోధన కేంద్రానికి సంబంధించి ఆక్రిప్ సిమ్లాలో ఉన్న సెంట్రల్ పొటాటో రిసెర్చ్(సీపీఆర్‌ఐ)కు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలకు సిమ్లాలోని సీపీఆర్‌ఐ ఆమోదం తెలిపేందుకు సంసిద్ధతను సైతం వ్యక్తం చేసింది. దీంతో సంగారెడ్డిలోని వైఎస్‌ఆర్ ఉద్యాన పరిశోధన కేంద్రం సైంటిస్టులు ఏడు రకాల బంగాళ దుంపలపై పరిశోధనలు చేసేందుకు సిద్ధపడ్డారు. మీరట్, లక్నో, ఆగ్రా నుంచి కుఫ్‌రీ పక్‌రాజ్ (కె166), కుఫ్రీ చంద్రముఖి, కుఫ్రీ బాద్‌షా, కుఫ్రీ జ్యోతి, కుఫ్రీ చిప్‌సోనా1, కుఫ్రీ చిప్‌సోనా–3 రకం బంగాళదుంపల సీడ్స్‌ను తెప్పించేందుకు అప్పట్లో అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయినా రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా పరిశోధనా కేంద్రం అంశం మరుగున పడింది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ఈ అంశం పరిశీలనకు రాలేదు. పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని రైతులకు స్థానికంగా మేలైన ఆలు విత్తనం లభించడంతో పాటు అధిక దిగుబడులనిచ్చే విత్తనం తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
నాసిరకం విత్తనంతో నష్టాలు
రైతులు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్న ఆలుగడ్డ విత్తనం నాసిరకంగా ఉండడంతో పంట దిగుబడులు రాకపోవడం, తెగుళ్ల బారిన పడడం వల్ల నష్టాలను చవిచూస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు రైతులు నేరుగా వెళ్లి తెచ్చుకోవడం కష్టతరంగా ఉండడంతో స్థానికంగా దళారులు విక్రయించే విత్తనమే కొనుగోలు చేసుకోక తప్పడం లేదు. విత్తనం ధర ఆకాశాన్నంటడం, చేతికి వచ్చిన పంటను విక్రయించేందుకు వెళితే ధర రాక పోవడం రైతులు నష్టాల బారిన పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment