కూతురును చూసేందుకు అత్తారింటికి వెళ్తుండగా..
● బైక్, ఆటో ఢీ.. యువకుడి మృతి ● ఆకారం గ్రామ శివారులో ఘటన
దుబ్బాకరూరల్: కూతురు పుట్టిందన్న సంతోషంలో అత్తారింటికి బయలు దేరిన యువకుడికి వేగంగా దూసుకువచ్చిన ఆటో మృత్యుపాశమైంది. బిడ్డ వద్దకు చేరకుండానే ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం కబళించింది. దీంతో ఆ కుటుంబం శోక సద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన మండల పరిధిలోని ఆకారం గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గంగరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోతారం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నరేష్ (28)కు నెల రోజుల క్రితం కూతురు పుటింది. తన భార్య పుట్టింట్లోనే ఉంది. తన భార్యను కూతురును తీసుకురావడానికి తన అత్తగారి ఊరైన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మల్కాపూర్‌కు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆకారం గ్రామ శివారులోకి రాగానే అతి వేగంగా దూసుకు వచ్చిన ఆటో బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయాలు కావడంతో నరేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment