గుట్టుచప్పుడుగా కోళ్ల పూడ్చివేత
●
నర్సాపూర్ : కోళ్ల ఫారాలలో చనిపోయిన కోళ్లను గుట్టు చప్పుడు కాకుండా పూడ్చి వాటి మరణంతో పాటు వాటికి సోకిన జబ్బు బయటికి తెలియకుండా దాచిపెడ్తున్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో కోళ్ల ఫారమ్‌ల్లోని కోళ్లు బర్డ్ ఫ్లూ వైరస్ సోకి చనిపోతుండగా నర్సాపూర్ ఏరియాలో వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్లు చనిపోగానే గోతులు తవ్వి వాటిని పూడ్చివేసే విధంగా ఇంటిగ్రేటెడ్ కోళ్ల కంపెనీలు చర్యలు తీసుకోవడంతో ఈ ప్రాంతంలో కోళ్లు మరణంపై స్పష్టత రావడం లేదు. నర్సాపూర్ డివిజన్ పరిధిలోని లింగాపూర్, పిల్లుట్ల, గూడూరు, లింగోజిగూడ, కంచన్‌పల్లి, చిట్కుల్, నాయిని జలాల్‌పూర్ తదితర గ్రామాల్లో వేలాది బాయిలర్ కోళ్లు మృత్యువాత పడ్డాయి. లింగాపూర్‌లో నాటు కోళ్లు సైతం చనిపోయాయి.
కమిషన్ ఇస్తూ పాతిపెట్టాలని సూచన
కోళ్ల ఫారాల షెడ్డు కల్గిన రైతులకు పలు కంపెనీలు కోడి పిల్లల మొదలు వాటికి కావాల్సిన మందులు, దాణా సరఫరా చేస్తున్నాయి. కోళ్లు కోతకు రాగానే తీసుకెళ్లి వాటి బరువును బట్టి రైతుకు కమిషన్ చెల్లిస్తుంటారు. కోళ్లు చనిపోవడంతో ఆయా కంపెనీలకు నష్టం సంభవిస్తున్నా కోళ్లు పెంచిన రైతులకు కంపెనీలు కొంత కమిషన్ ఇస్తూ చనిపోయిన కోళ్లను పాతి పెట్టాలని సూచిస్తున్నారు కోళ్లు చనిపోయిన విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో కోళ్లకు సోకిన వైరస్ తేలడం లేదని విమర్శలు వస్తున్నాయి.
షాంపిల్స్ సేకరణ
కోళ్లు చనిపోయిన విషయం తెలిస్తే వాటి షాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపిస్తున్నామని స్థానిక పశు సంవర్థక శాఖ ఏడీ డాక్టర్ జనార్దన్‌రావు చెప్పారు. కోళ్లు చనిపోయిన విషయం తమకు తెలియడం లేదని చెప్పారు. కోళ్లకు సరిపడా దాణా పెట్టనందున పలు చోట్ల కోళ్లు చనిపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
నర్సాపూర్ డివిజన్ పరిధిలో వేలాదిగా మృతి
Comments
Please login to add a commentAdd a comment