మల్లన్న ఆలయ హుండీలపై పర్యవేక్షణ కరువు
నగదు చోరీకి యత్నించిన వ్యక్తి
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు సమర్పించిన కానుకలు, ఒడి బియ్యం హుండీలపై ఆలయ అధికారుల పర్యవేక్షణ కరువైంది. సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ ఆలయ అధికారుల డొల్లతనం మరోమారు బయటపడింది. స్వామి వారి అర్ధమండపం, ముఖమండపంలోని పలు హుండీలు సిబ్బంది కనుసన్నల్లో ఉండగా, గంగిరేణు చెట్టు ప్రాంగణంలో ఉన్న పలు హుండీలను ఎవరూ పట్టించుకోక పోవడం వివాదాస్పదమవుతుంది. సీసీ కెమెరాలు ఉన్నా పరిశీలించే వారు కరువయ్యారు. ఇటీవలె గుర్తుతెలియని వ్యక్తి దర్జాగా గంగిరేణు చెట్టు ప్రాంగణంలో వీవీఐపీ క్యూలైన్ సమీపంలో ఉన్న ఓ హుండీలో కనిపిస్తున్న నగదును ఇనుప చువ్వతో అపహరించేందుకు యత్నించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.ఈ ఫొటోలు శుక్రవారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
మహిళను కాపాడిన పోలీసులు
చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం
జిన్నారం (పటాన్‌చెరు): చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు కాపాడారు. ఈ ఘటన గుమ్మడిదల గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహేశ్వర్ రెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన బక్క రేణుక (35) శుక్రవారం సాయంత్రం గ్రామ సమీపంలోని ఎర్ర చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా బందోబస్తు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ అద్వైత రెడ్డి గమనించి ఎస్‌ఐకి సమాచారం అందించారు. ఎస్‌ఐ పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది కిషోర్ సాయి వర్ధన్‌కు చెప్పి వెళ్లి మహిళను కాపాడాలని సూచించారు. కానిస్టేబుళ్లు ఇద్దరూ చెరువులోకి వెళ్తున్న మహిళను ఆపి నచ్చజెప్పి ఇంటి వద్దకు తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కల్లు గీస్తుండగా చెట్టుపై నుంచి పడి గాయాలు
నంగునూరు(సిద్దిపేట): తాడిచెట్టుపై నుంచి పడటంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం కొండంరాజ్‌పల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నల్లూరి మోహన్‌గౌడ్ కల్లు గీసేందుకు చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన గ్రామస్తులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కల్లుగీతపై ఆధారపడి జీవిస్తున్న మోహన్‌గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
అక్రమంగా షెడ్డు నిర్మాణం
జిన్నారం(పటాన్‌చెరు): మండలంలోని గడ్డపోతారం మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా షెడ్డు నిర్మాణం కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు వరుసగా వార్తా పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. కళ్లెదుటే షెడ్డు నిర్మాణం కొనసాగుతున్నా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా అక్రమార్కులు దర్జాగా నిర్మాణాలు చేపడుతుంటే పట్టించుకోకపోవడం సరికాదంటున్నారు. ఇప్పటికై నా స్పందించి అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.
మల్లన్న ఆలయ హుండీలపై పర్యవేక్షణ కరువు
మల్లన్న ఆలయ హుండీలపై పర్యవేక్షణ కరువు
Comments
Please login to add a commentAdd a comment