
వేగంగా ఖేడ్–బీదర్ హైవే పనులు
నారాయణఖేడ్: జాతీయ రహదారికి 15కిలోమీటర్ల దూరంగా మారుమూలగా ఉన్న నారాయణఖేడ్ పట్టణానికే జాతీయ రహదారి వచ్చి చేరింది. జాతీయ రహదారితోనే అభివృద్ధి సాధ్యమని ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రాంత వాసుల కల నెరవేరబోతుంది. వ్యాపార, వాణిజ్య, విద్య, వైద్యం, రవాణా తదితర రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించనుంది. కేంద్రం జాతీయ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు మరింత వేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్– నాందేడ్– అకోలా 161 జాతీయ రహదారిని కలుపుతూ నారాయణఖేడ్ పట్టణం మీదుగా 161బీగా జాతీయ రహదారి నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు ఎంపీగా ఉన్న సురేశ్‌షెట్కార్ నిజాంపేట్– నారాయణఖేడ్– బీదర్ జాతీయ రహదారిని మంజూరు చేయించారు. అప్పట్లో ఎన్‌హెచ్ 50గా నిర్ధారించారు. అకోలా–నాందేడ్ 161 జాతీయ రహదారిగా ఉండటంతో ఈ రహదారికి అనుసంధానంగా నిర్మాణం జరుగుతుండటంతో 161బీగా మార్చారు.
వేగంగా పనులు
జాతీయ రహదారి సర్వే, భూసేకరణ తదితర పనులకు మూడు నాలుగేళ్లు పట్టింది. కానీ,రహదారి నిర్మాణం పనులు ప్రారంభమయ్యాక జోరుగా సాగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్రం రూ.518కోట్లు విడుదల చేసింది. సంగారెడ్డి– నాందేడ్– అకోలా జాతీయ రహదారి అనుసంధానంగా నిజాంపేట్ నుంచి నారాయణఖేడ్ మీదుగా బీదర్ వరకు రోడ్డు నిర్మిస్తున్నారు. నిజాంపేట్ నుంచి బీదర్‌కు 60 కిలోమీటర్ల దూరం. రహదారి చాలాచోట్ల మూలమలుపులుగా ఉండటంతో దూరాభారం పెరిగింది. అయితే ఈ జాతీయ రహదారిలో మూలమలుపులను తగ్గిస్తూ రెండు లైన్లుగా నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత దూరం 46కిలోమీటర్ల దూరమే అవుతుంది. ఖేడ్ నుంచి 40కిలోమీటర్ల దూరం ఉన్న రహదారి మూలమలుపు తగ్గించడం వల్ల ఖేడ్ నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరమే అవుతుంది. నిజాంపేట్ నుంచి నారాయణఖేడ్, మనూరు, న్యాల్‌కల్, డప్పూర్ మీదుగా బీదర్ వరకు రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం బీదర్‌కు ఖేడ్ నుంచి గతుకుల రోడ్డుపై ప్రయాణించేందుకు గంటన్నర సమయం పడుతుండగా జాతీయ రహదారి నిర్మాణం వల్ల అరగంటలోపు బీదర్‌కు వెళ్లిపోవచ్చు. రహదారి వెట్‌మిక్స్, జీఎస్‌బీ, బిట్‌మిన్ ప్రైమింగ్ పనులను సైతం పూర్తయ్యాయి. బీటి (తారు) నిర్మాణం పనులు జోరందుకోనున్నాయి. జాతీయ రహదారి నిర్మాణం 20శాతం పనులు పూర్తి చేశారు. ఈ ఏడాదిలోపు జాతీయ రహదారి రవాణాకు అందుబాటులోకి వస్తుంది.
అభివృద్ధికి దోహదం..
ఖేడ్ పట్టణానికి సంగారెడ్డి 80 కిలోమీటర్లు, హైదరాబాద్ 150కిలోమీటర్ల దూరం. దగ్గరగా ఉన్న పట్టణం బీదర్. రహదారి పనులు పూర్తయితే వ్యాపార, వాణిజ్య, వైద్యం, విద్య, ఇతరత్రా పనులకు బీదర్‌కు వెళ్లేందుకు, అక్కడివారు ఇక్కడికి వచ్చేందుకు ఆస్కారం ఉంది. చాలా అవసరాల నిమిత్తం ఇప్పటికే జనాలు బీదర్‌కు వెళ్తుంటారు. రోడ్డు పూర్తయితే మరింత అనువుగా మారనుంది.
నెరవేరనున్న ఏళ్లనాటి కల
వ్యాపార, వాణిజ్య పరంగా
మరింత అభివృద్ధి!
రవాణా సదుపాయం మెరుగు
మరింత అభివృద్ధి చెందుతుంది
ఖేడ్ ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేందుకు తాను మొదటిసారి ఎంపీగా ఉండగా తన కోరికమేరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజాంపేట్– ఖేడ్– బీదర్ జాతీయ రహదారిని మంజూరు చేసింది. భూసర్వే, పరిహారం తదితర అంశాలవల్ల ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరగా రహదారి అందుబాటులోకి వస్తే ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది.
– సురేశ్ షెట్కార్, ఎంపీ, జహీరాబాద్
నిర్ణీత సమయంలో పూర్తి చేస్తాం
నిజాంపేట్– ఖేడ్– బీదర్ 161బీ జాతీయ రహదారి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. వెట్‌మిక్స్, జీఎస్‌బీ, బిట్‌మిన్ ప్రైమింగ్ పనులు పూర్తయ్యాయి. బీటీ పనులు చురుగ్గా జరిగేలా చూస్తాం. పనులు పూర్తి నాణ్యతతో జరిగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.
– రామకృష్ణ,
జాతీయ రహదారుల డిప్యూటీ ఈఈ

వేగంగా ఖేడ్–బీదర్ హైవే పనులు

వేగంగా ఖేడ్–బీదర్ హైవే పనులు
Comments
Please login to add a commentAdd a comment