
అంబరాన్నంటిన హోలీ వేడుకలు
పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ
సంగారెడ్డి జోన్: రంగుల పండగ హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఆవరణలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, కుటుంబ సభ్యులు, అధికారులతో కలసి వేడుకల్లో పాల్గొన్నారు. తన కార్యాలయం ఆవరణలో ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ సంజీవరావు అధికారులతో కలసి వేడుకలు జరుపుకొన్నారు.
108 కిలోల గుండు
ఎత్తుకుని ప్రదక్షిణలు
నారాయణఖేడ్: ఖేడ్ మండలం తుర్కాపల్లిలో హోలీ పండుగ సందర్భంగా బండరాళ్ల గుండ్లు ఎత్తుకుని గ్రామదేవత ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. శుక్రవారం హోలీ పండుగను పురస్కరించుకుని గ్రామానికి చెందిన యువకుడు సాతిని జ్ఞానేశ్వర్ 108 కిలోల బరువున్న బండరాయి గుండును అవలీలగా ఎత్తుకుని గ్రామదేవత ఆలయం చుట్టూ అయిదు ప్రదక్షణలు చేసి ఔరా అనిపించాడు. గ్రామ పెద్దలు కరతాళధ్వనులతో అతడిని ఉత్సాహపరిచారు. అనంతరం రంగులు చల్లుకుంటూ హోలీ పండును నిర్వహించుకున్నారు.
రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్
పోటీలకు ఎంపిక
నారాయణఖేడ్: ఖేడ్ మండలం జుజాల్‌పూర్ శివారులోని ఈ–తక్షిల పాఠశాలకు చెందిన విద్యార్థులు సాయిస్ఫూర్తి, రాధప్రియ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎస్‌ఈఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుట్‌బాల్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈమేరకు పాఠశాల కరస్పాండెంట్ శరత్‌కుమార్, ప్రిన్సిపాల్ అవిక తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 16 వరకు వనపర్తిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారని వివరించారు.
విధుల నిర్వహణలో
అప్రమత్తంగా ఉండాలి
సంగారెడ్డిజోన్: పోలీసు అధికారులు తమ విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాటు చేసిన బందోబస్తును శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన కూడళ్లను పరిశీలించి, ప్రమాదాలు చోటు చేసుకోకుండా డ్రంకెన్ డ్రైవ్‌లు నిర్వహించాలన్నారు. వాహనదారులపై రంగులు వేయడం లాంటివి చేయకూడదని తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి కదలికలను గమనించాలని తెలియజేశారు.

అంబరాన్నంటిన హోలీ వేడుకలు

అంబరాన్నంటిన హోలీ వేడుకలు

అంబరాన్నంటిన హోలీ వేడుకలు

అంబరాన్నంటిన హోలీ వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment