
ఏఐ వినియోగంతో బోధన సులువు
కలెక్టర్ వల్లూరు క్రాంతి
పటాన్‌చెరు టౌన్: అభ్యాసన ప్రక్రియలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంతో బోధన సులువవుతుందని విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి ముత్తంగిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఏఐ ఆధారిత బోధన, అభ్యాసన ప్రక్రియను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ... బోధన, అభ్యాసన ప్రక్రియలో నూతన పద్ధతుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ముత్తంగి ప్రాథమిక పాఠశాలతోపాటు జిల్లాలో 33 పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధనను ప్రారంభించామన్నారు. ఈ పథకం అమలు చేయనున్న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే ఇంటర్నెట్ సౌకర్యం అందించామని వెల్లడించారు. తల్లిదండ్రులను పూర్తిస్థాయిలో పాఠశాల, విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా చూడాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తోన్న సౌకర్యాలను వినియోగించుకుని తమ పిల్లలు మరింత ఉన్నతస్థాయికి ఎదిగేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని స్పష్టం చేశారు.
ఇంటర్ పరీక్షల కేంద్రం తనిఖీ
పటాన్‌చెరు మండలం ముత్తంగిలోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ క్రాంతి సందర్శించారు. అనంతరం కలెక్టర్ పాఠశాలల్లోని మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో కిచెన్ షెడ్డును, డైనింగ్ హాల్‌ను, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు.
ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
పటాన్‌చెరు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్‌లో నిర్మిస్తోన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ క్రాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...స్వయం సహాయక సంఘాల ద్వారా శిక్షణ పొందిన మహిళా మేసీ్త్రలు ఇండ్ల నిర్మాణంలో భాగస్వాములయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment