దుబ్బాకటౌన్: చిరుత సంచార ప్రాంతాల్లో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఫారెస్ట్ రేంజ్ అధికారి సందీప్ కుమార్ అన్నారు. రాయపోల్–తిమ్మక్కపల్లి గ్రామ శివారులో గల్వని చెరువు ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆచూకీ కోసం బుధవారం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా అధికారులు అనుమానిత ప్రాంతాలను సందర్శించి రైతుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం సందీప్ కుమార్ మాట్లాడుతూ.. చిరుత పులి సంచరిస్తూ.. రైతులకు కనిపించిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కాలి ముద్రలు సేకరించి చిరుత పులివేనని నిర్ధారించామన్నారు. చిరుత పులి ఎప్పుడు ఒకే చో ట నివాసం ఉండదని తరచూ తిరుగుతుంటుందని సూచించారు. రైతులు గొర్రెలు, మేకలు, పశువులను పొలాల వద్ద ఉంచొద్దన్నారు. చిరుత పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రైతులెవరూ పొలాల చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాట్లు చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో రాయపోల్ ఏఎస్‌ఐ దేవయ్య, సెక్షన్ ఆఫీసర్లు హైమద్ హుస్సేన్, బీట్ ఆఫీసర్లు జహంగీర్, వేణు, కానిస్టేబుల్ స్వామి, సిబ్బంది తదితరులున్నారు.
అనుమానిత ప్రాంతాల్లో ఏర్పాటు
కాలి ముద్రలు సేకరణ
రైతులు అప్రమత్తంగా ఉండాలి
ఫారెస్ట్ రేంజ్ అధికారి సందీప్ కుమార్