పల్లేరులు మొలిచిన చోట పసిడి పంటలు
తోటలోని క్యాబేజీని
చూపిస్తున్న వెంకటరావు
హుస్నాబాద్‌రూరల్: పల్లేరులు మొలిచే దుబ్బ నేల కరువు నీళ్లకు ఏం ఎవుసం చేసినా ఏ పంటలు పడుతాయి, రూ.లక్షలు పెట్టి బోరువేసినా కొద్దిపాటి నీరే వచ్చే, ఏ పంట వేసినా చేతికి వచ్చే వరకు బోరు నీరు పోస్తదా..? అనే సందేహం ఆ ఏడు పదుల రైతును ఆలోచింపజేసింది. బాటన పోయేవారు ఏలెత్తి చూపి గీ.. నీళ్లకు ఏం ఎవుసం చేత్తవ్ అనే వాల్లె తప్ప ప్రోత్సహించే వారు లేరు. రైతుకు తన మదిలో మెదిలే ఆలోచనలను ఒక్కొక్కటి అమలు చేసి ఎకరం భూమిలో 20 రకాల పంటలను సాగు చేసి పల్లేరులు మొలసిన చోటనే పసిడి పంటలు పండించి వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్నాడు ఏడు పదుల రైతు వెంకటరావు..
హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామానికి చెందిన మంతెన వెంకటరావు డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో వ్యాపారంలోకి దిగాడు. హుస్నాబాద్ పట్టణంలో స్థిరపడ్డ వెంకటరావు వ్యవసాయ అవసరాలైన పైపులు, మోటార్ల వ్యాపారం మొదలు పెట్టాడు. ఊరిలో అమ్మానాన్న ఇచ్చిన వ్యవసాయ భూమి వైపు కన్నెతి చూడలేదు. పిల్లలను ఉన్నత చదువులు చదివించడంతో ఒక బిడ్డ హైదరాబాద్‌లో వైద్యురాలిగా సేవలందిస్తుంది. వృద్ధాప్యం రావడంతో వ్యాపారం బంద్ చేసి దుకాణంను వేరొకరికి లీజుకు ఇచ్చాడు.
● బంతి పూలు, స్వీట్‌కార్న్,
కూరగాయలు సాగు
● ఏడు పదుల వయస్సులోనూ
వ్యవసాయం
● ఆదర్శంగా నిలుస్తున్న తోటపల్లి
గ్రామానికి చెందిన మంతెన వెంకటరావు
రూ.1.50 లక్షలతో బోరు
పుట్టిన ఊరిలో అమ్మానాన్న ఇచ్చిన ఎకరం వ్యవసాయ భూమిలో ఏదైనా సాగు చేయాలనే ఆలోచన తట్టగానే రూ.1.50 లక్షలతో బోరు వేయించాడు. బోరు నుంచి వచ్చే కొద్దిపాటి నీటితో పంటలు పండించడం కష్టమే అయినా స్వల్పకాలిక పంటలు సాగు చేయాలని నిర్ణయించాడు. వేరుశనగ, బంతి పూలు, మిరప, స్వీట్‌కార్న్, బెండ, సోర, వంకాయ, క్యాబేజీ, బీర, కోతి మీర, చిక్కుడు, టమాట కూరగాయలు సాగు చేస్తున్నాడు. స్వల్పకాలిక పంటలు కావడంతో కష్టానికి ఫలితం వస్తుందని రైతు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. పల్లేరులు మొలిచిన చోటనే రైతు ఆలోచనతో పసిడి పంటలు తీసి పల్లె రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
మిరప తోటలో రైతు
నీరు చూసి పంటలు వేయాలి
బోరు వేసినప్పుడు కొద్దిపాటి నీరే వచ్చింది. ఈ నీళ్లతో ఏ పంటలు పండుతాయని అందరూ అన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం వల్ల తక్కువ కాలంలో లాభాలను పొందవచ్చని ఆలోచన వచ్చింది. స్వీట్‌కార్న్, వేరుశనగ, మొక్కజొన్న, కూరగాయలు, మిరప వీటికి మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మూడు గుంటల బంతి పూలు పెడితే రూ.20 వేలు వచ్చినయ్, మిర్చి మూడు నెలల నుంచి కాస్తనే ఉంది. సాగుకు పని చేయదు అన్న భూమిలోనే రకరకాల పంటలు వేస్తున్నాను. మన చేళ్లలో పండిన కాయలు, పంటలు మన ఇంట్లో అవసరాలకు ఉపయోగపడుతున్నాయి.
– మంతెన వెంకటరావు, కిషన్‌నగర్
పొలం ఎకరం.. మడిమడికో రకం
పొలం ఎకరం.. మడిమడికో రకం