
వరిపై తెగుళ్ల దాడి
ఏం తోస్తలేదు
నాలుగు ఎకరాల వరి పంట వేసిన.. చేను మొత్తం ఈనుతుంది. ఈనినా గొలుసు పాలు పోసుకోకుండా గింజ గట్టి పడకుండా తెల్లగా నిలబడిపోతుంది. చేను గిట్లయితుందని మందు తెచ్చి కొట్టినా ఏం లాభం లేదు. వ్యవసాయాధికారి వచ్చి చూశారు. చేతికొస్తుందనుకున్న చేను గిట్లకావట్టే.. ఏం తోస్తలేదు. గత వానాకాలంలో కూడా గిట్లనే అయ్యి చాలా నష్టమైంది.
– పాతూరి లక్ష్మణ్, రైతు దుబ్బాక
పంటలను పరిశీలిస్తాం
జిల్లాలో ఈ యాసంగిలో పెద్ద ఎత్తున వరి పంటల విస్తీర్ణం పెరగడంతో రకరకాల తెగుళ్లు వస్తున్నా యి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వరి పంటలను వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి వ్యవసాయాధికారులం పరిశీలించి ఎందుకు ఇలా జరుగుతుందో పూర్తిగా అధ్యయనం చేస్తాం. రైతులు తమ పంటలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకొస్తే సమస్య మొదట్లోనే పరిష్కరిస్తే ఎక్కువ నష్టం కలుగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు.
– రాధిక, జిల్లా వ్యవసాయ అధికారి
చేతికొచ్చే దశలో
దెబ్బతింటున్న చేను
● గింజలు గట్టి పడకుండా తాలుపోతున్న గొలుసులు
● ఎన్ని మందులు కొట్టినా దక్కని ఫలితం
● మెడ విరుపు, మొగి పురుగు, అగ్గితెగులు అంటున్న వ్యవసాయాధికారులు
● ఆందోళనలో జిల్లా రైతాంగం
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కొండె ఎల్లారెడ్డి. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ గ్రామం. ఈ యాసంగిలో తనకున్న 10 ఎకరాల్లో వరి పంట వేశాడు. పంట ఈని గొలుసులు బయటకు వచ్చాక గింజ గట్టి పడకుండా తాలుపోయి(పొల్లు) తెల్లగా నిలబడిపోతుంది. ఎంతో ఖర్చు పెట్టి రకరకాల మందులు స్ప్రే చేసినా ఫలితం లేదు. ఇప్పటికే వేల రూపాయల మందులు తెచ్చి కొట్టినా మట్టిలో పోసినట్లే అయ్యింది. అప్పు తెచ్చి రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టిండు. పంటకు వచ్చి తెలుగు చూసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. ఇది ఈ ఒక్క రైతు పరిస్థితే కాదు జిల్లాలోని రైతుల అందరి పంటలు ఇలాగే ఉన్నాయి.
దుబ్బాక: వరి పంటలకు మాయదారి రోగం ఏదో సోకడంతో రైతులు పరేషాన్‌లో పడ్డారు. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని.. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినా తీరా పంట చేతికొస్తుందన్న గ్యారంటీ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలే వానాకాలంలో భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దిగుబడులు రాక రైతులకు పెట్టుబడులు మీదపడ్డాయి. ఈ యాసంగిలోనైనా పంటలు బాగా వస్తుందని గంపెడాశతో పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. తీరా చేను పొట్టదశకు వచ్చి ఈనుతున్న తరుణంలో బయటకు వచ్చిన గొలుసులకు గింజలు గట్టిపడకుండా తెల్లగా తాలు పోయి అలాగే నిలబడిపోతుండటంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.
3.53 లక్షల ఎకరాల్లో సాగు..
జిల్లాలో చెరువులు..కుంటల్లో సమృద్ధిగా నీరుండడంతో ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో 3.53 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు అయ్యింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ముందుగా వేసిన వరి పంటలు ఈని గింజలు ఎర్రబడుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా ప్రాంతాల్లో ఈనిన వరి చేలు ఈనినట్లుగానే గొలుసులకు గింజలు పాలుపోసుకోకుండా అలాగే తెల్లబడి నిలబడిపోతున్నాయి. దుబ్బాక మండలంలోనే కాదు జిల్లాలోని చాలా గ్రామాల్లో వరి పంటల పరిస్థితి ఇలాగే తయారైంది. కొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందనుకున్న రైతులకు ఈ మాయదారి రోగం ఆందోళన కలిగిస్తుంది.
ఇష్ట మొచ్చిన మందులు
వరి చేనుపై రైతులు ఇష్టమొచ్చిన మందులు పిచి కారీ చేస్తున్నా ఫలితం లేని పరిస్థితి కనబడుతుంది. నాట్లు వేసినప్పుడు వాతావరణ పరిస్థితులతో ఎదగకుండా ఎర్రగా ఉండటంతో అప్పటి నుంచి ఇప్పుడు ఈని గొలుసు తాలుబోతుండటంతో రకరకాల మందులను వేల రూపాయలు పెట్టి తెచ్చి స్ప్రే చేస్తున్నా ఫలితం లేని పరిస్థితి ఏర్పడింది.
మెడ విరుపు, మొగి పురుగు, అగ్గి తెగుళ్లే..
వరి చేను ఈని గింజలు గట్టి పడకుండా తాలుపోవడం వంటిది మొగి పురుగు, అగ్గి తెగుళ్ల లక్షణాలుగా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇది వరకు అగ్గి తెగులు సోకిన భూముల్లో ఈ మెడవిరుపు తెగులు లక్షణాలు కనబడుతున్నాయని చెబుతున్నారు. వానాకాలంలో సైతం ఇలాగే వరి పంటలకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వరి పంటలపై మెడ విరుపు లక్షణాలు కనిపిస్తే ట్రై సైక్లోజన్ లేదా గెలిలియో సెన్స్ మందులు స్ప్రే చేయాలంటూ వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు.

వరిపై తెగుళ్ల దాడి

వరిపై తెగుళ్ల దాడి

వరిపై తెగుళ్ల దాడి