
క్యాన్సర్ అంటే భయం వద్దు
● సకాలంలో గుర్తిస్తే ఆదిలోనేజయించే అవకాశం ● మున్సిపల్ చైర్మన్ మంజుల ● సిద్దిపేటలో 19న ఉచిత వైద్య శిబిరం
సిద్దిపేటజోన్: క్యాన్సర్ అంటే ప్రజల్లో ఒక భయం ఉందని, అలా భయపడొద్దని ప్రాథమిక దశలో గుర్తించి సరైన వైద్యం అందిస్తే జయించే అవకాశం ఉందని మున్సిపల్ చైర్మన్ మంజుల, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వేణుగోపాల్ రెడ్డి, సాయిరాంలు పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కిమ్స్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ వైద్యులు డాక్టర్ మధు, డాక్టర్ శ్రవణ్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రత్యేక చొరవతో కిమ్స్ ఆస్పత్రి సౌజన్యంగా ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 19న స్థానిక విపంచి ఆడిటోరియంలో ఉదయం 9నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో మమోగ్రఫీ, పాప్ స్మియర్, బోత్‌బ్రెస్ట్ అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే, ఎండోస్కోపీ, అల్ట్రా సౌండ్ తదితర పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఈర్షద్, వర్మ, రాములు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.