
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి భూభారతి
కలెక్టర్ వల్లూరు క్రాంతి
కొండాపూర్(సంగారెడ్డి): రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి భూభారతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. మండల పరిధిలోని గోకుల్ గార్డెన్ ఫంక్షన్ హాలులో రైతులకు భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టం –2025 పై అవగాహన సదస్సును టీజీఐఐసీ చైరపర్సన్ నిర్మలారెడ్డితో కలసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. లోప భూ ఇష్టమైన ధరణితో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. భూభారతితో రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అంబాదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, సీడీసీ చైర్మన్ రామ్‌రెడ్డి పాల్గొన్నారు.