
పోయింది అధికారం మాత్రమే
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సదాశివపేట(సంగారెడ్డి): బీఆర్‌ఎస్ పార్టీకి పోయింది అధికారం మాత్రమేనని ప్రజల గుండెల్లో ఉండేది గులాబీ జెండానే అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని ఎన్‌గార్డెన్‌లో బీఆర్‌ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చింతా మాట్లాడుతూ...బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 27న హన్మకొండలోని ఎల్కతుర్తిలో నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. గ్రామాల్లో రజతోత్సవ సభ గురించి ప్రజలకు వివరించి వాల్‌పోస్టర్లు అతికించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు,కార్యదర్శి అరిఫోద్దిన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు సుధీర్‌రెడ్డి, మల్లాగౌడ్, తాజా మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
హోప్ ఆస్పత్రికి
రూ.50 వేల జరిమానా
సంగారెడ్డి: నిబంధనలు పాటించకుండా వైద్యం చేసి ఓ వ్యక్తి మృతికి కారణమైన సంగారెడ్డిలోని హోప్ న్యూరో ఆస్పత్రికి రూ.50 వేల జరిమానా విధించడంతోపాటు నోటీసులు అందించారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి శనివారం మీడియాకు వివరించారు. కోహీర్ మండలం పైడి గుమ్మల్ గ్రామా నికి చందిన నవీన (37) హోప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 2న మరణించాడు. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈనెల 4న ఆస్పత్రిలో జిల్లా వైద్యాధికారులు విచారణ చేపట్టారు. ఇందులోభాగంగా నిబంధనలు పాటించకుండా వైద్యం చేసినట్లు విచారణలో తేలింది. మరో ఐదు రోజుల్లో రోగి మృతికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొనట్లు ఆమె వెల్లడించారు.
పత్తి సాగులో
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్
సంగారెడ్డి టౌన్: రైతులు పత్తి సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలో శనివారం రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పత్తి పంట పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అధిక సాంద్రత పద్ధతిలో వేసిన పంటలను సాగు చేస్తే మేలైన దిగుబడి ఉంటుందని మంచి లాభాలు వస్తాయన్నారు. రైతులకు పత్తి సాగులో మెళకువలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం సమన్వయకర్త కో ఆర్డినేటర్ రాహుల్ విశ్వక్, మండల అధికారి ఝాన్సీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
27న ఆదర్శ పాఠశాల
ప్రవేశ పరీక్ష
జిన్నారం (పటాన్‌చెరు): బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. ఆరో తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. విద్యార్థులు ఆన్లైన్లో telanganams.cgg.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు.
మండుతున్న ఎండలు
42డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
సంగారెడ్డి జోన్: జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 41డిగ్రీలు దాటి 42కు చేరువలో నమోదవుతున్నాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు రావడానికి జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకురావటం లేదు. దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు ఇళ్లలో ఉక్కబోతకు భరించలేకపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో విద్యుత్తు సరఫరా లేని సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో శనివారం 16 మండలాలల్లో 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదైంది. అత్యధికంగా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్‌లో 41.8డిగ్రీలు నమోదు కాగా అత్యల్పంగా మునిపల్లి మండల పరిధిలోని కంకోల్‌లో నమోదైంది.