
ఉగ్రవాదంపై ఉక్కుపాదమే
సాక్షి, సిద్దిపేట: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పీఎం మోదీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పాశవికచర్య అని, సెక్యులర్ మేధావులు సైతం తీవ్రంగా ఖండించాలన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ఈ ఘటనపై స్టాలిన్, కమల్ హాసన్, ప్రకాశ్‌రాజ్, సెక్యులర్ మేధావులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా దేశంలో అలజడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓ రకమైన అల్లర్లు సృష్టించేందుకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందన్నారు. టెర్రరిస్ట్ సంస్థలపై మోదీ ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయాల వల్ల పాతబస్తీలో అభివృద్ధి జరగలేదని, మెట్రో రాలేదని విమర్శించారు. ఒవైసీ పేద ముస్లింల కోసం ఆలోచించడం లేదని చెప్పారు. డెవలప్‌మెంట్‌కి ముస్లింలను దూరంగా ఉంచేది ఏంఐఎం పార్టీ అని విమర్శించారు.
మదర్సాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి
తెలంగాణలో ఉన్న మదర్సాల్లో ఎవరు ఉంటున్నారు? ఏ రాష్ట్రం వారు ఉంటున్నారు? వారి కుటుంబ నేపథ్యం ఎంటీ? విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణను ఇస్లామిక్ అడ్డాగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరని అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సెక్యులర్ మేధావులు సైతం ఉగ్రదాడిని ఖండించాలి
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు