
భూ భారతితో ఆ కమిటీలు పునరుద్ధరణ
● ఎమ్మెల్యే సంజీవరెడ్డి ● నిర్ణీత గడువులోగా పరిష్కారం ● కలెక్టర్ వల్లూరు క్రాంతి ● నాగల్‌గిద్ద, మనూరు మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు
నారాయణఖేడ్: భూ భారతి చట్టంతో అసైన్మెంట్ కమిటీలు పునరుద్ధరణ చేశారని, తద్వారా పేదలకు భూమి పట్టాలు, ఇళ్ల పట్టాలు జారీ చేసే అధికారం కలిగిందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ధరణితో ఎన్నో అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. మనూరు, నాగల్‌గిద్ద మండల కేంద్రాల్లో సంజీవరెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు హాజరై కలెక్టర్ మాట్లాడారు. నిర్ణీత గడువులోగా భూ సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతి చట్టం దోహదపడుతుందన్నారు. భూమి హక్కుల రికార్డుల్లో ఏవైనా లోటుపాట్లు, తప్పులుంటే వాటిని సవరించుకునేందుకు నూతన ఆర్‌ఓఆర్ 2025 చట్టం వెసులుబాటు కల్పిస్తోందన్నారు. ఎవరికై నా భూముల రికార్డుల విషయంలో తప్పులు ఉంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వివాదాలకు ఆస్కారం లేకుండా...
భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా పట్టాపాస్ బుక్కులలో సమగ్ర వివరాలతో, హద్దులను పేర్కొంటూ భూమి పటం (మ్యాప్) పొందుపరుస్తారని కలెక్టర్ తెలిపారు. ఆధార్ తరహాలోనే భూముల వివరాలతో కూడిన భూధార్ నంబర్ కేటాయిస్తారని చెప్పారు. ఈ చట్టంలో ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు కూడా హక్కుల రికార్డు ఉంటుందన్నారు. సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను కోర్టు స్టే విధించడం వల్ల ధరణిలో పరిష్కరించేందుకు అవకాశం లేకపోయిందని, ప్రస్తుతం కొత్త ఆర్‌ఓఆర్ చట్టంలో పెండింగ్ దరఖాస్తులను ఆర్డీఓలు పరిశీలించి క్రమబద్ధీకరిస్తారని తెలిపారు.
నల్లపోచమ్మను సందర్శించుకున్న కలెక్టర్
మనూరు మండలంలోని బోరంచ నల్లపోచమ్మ ఆలయంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్‌కు నల్లపోచమ్మ తల్లి చిత్ర పటాన్ని ఎమ్మెల్యే బహూకరించారు.
రైతులు అవగాహన ఏర్పరచుకోవాలి: కలెక్టర్
కల్హేర్(నారాయణఖేడ్): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగాా రైతులు అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సిర్గాపూర్ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై జరిగిన అవగాహన సదస్సులో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్ మాధురితో కలిసి కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ....ఆర్థిక స్థోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, డీఎఓ శివప్రసాద్, ఆర్డీవో అశోక చక్రవర్తి, ఏడిఏ నూతన్‌కుమార్, తహసీల్దార్ నజీంఖాన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మనీశ్ పాటీల్ తదితరులు పాల్గొన్నారు.