
గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్న మంత్రి హరీశ్ రావు
అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా
మహిళల పేరిట అన్ని పథకాలు
సిద్దిపేటజోన్: బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలను మహిళల పేరిట మంజూరు చేయాలని నిర్ణయించిందని, వారికి నేరుగా ఇవ్వడం వల్ల ప్రతి పైసా సద్వినియోగం అవుతుందని సీఎం కేసీఆర్ నమ్మకమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం స్థానిక కొండ భూదేవి గార్డెన్స్‌లో నియోజకవర్గ పరిధిలోని గృహలక్ష్మి పథకం కింద 800 లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖాళీ స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షలు సాయం చేయాలని, అది మహిళల పేరిట ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్వయంగా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కల్యాణలక్ష్మి పథకం కూడా మహిళల పేరిట మంజూరు చేసిన విషయం గుర్తు చేశారు.
సిద్దిపేటకమాన్: రాబోయే రోజుల్లో రంగనాయక సాగర్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధి ఒకటో వార్డు లింగారెడ్డిపల్లిలో పద్మశాలి, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించి, కుమ్మరి, కమ్మరి, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటకు అన్ని దిక్కులా రూ.60కోట్లతో 4 వరుసల రోడ్డు ఇప్పటికే నిర్మించామని తెలిపారు. లింగారెడ్డిపల్లిలో రూ.2కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. నాలుగు వరుసల రహదారికి 100 ఫీట్ల స్థలం అవసరం కానీ, గ్రామంలో ఇళ్లు దెబ్బతింటున్నాయని 80 ఫీట్ల రోడ్డు రేణుకా ఎల్లమ్మ గుడి నుంచి మెట్టుబండల వరకు సెంట్రల్ లైటింగ్‌తో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామన్నారు. చింతల్ చెరువు కింద బ్రిడ్జి నిర్మించడం జరుగుతుందన్నారు. లింగారెడ్డిపల్లిలో ఇప్పటికే బస్తీ దవాఖానా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించామని, రంగనాయక సాగర్‌లో పల్లగుట్టపై రూ.110 కోట్లతో డెస్టినేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
దసరాలోపు వెయ్యి పడకల ఆస్పత్రి
సిద్దిపేట ఏన్సాన్‌పల్లి శివారులో నిర్మిస్తున్న వెయ్యి పడకల ప్రభుత్వ ఆస్పత్రిని దసరా పండగ లోపు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఆస్పత్రిలో 150 మంది వైద్యుల ద్వారా క్యాన్సర్‌తో పాటు అన్ని రకాల వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. కేసీఆర్ కిట్లు, రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా లింగారెడ్డిపల్లికి చెందిన మాల, విశ్వ బ్రాహ్మణ, శాలివాహన, కుమ్మరి, వడ్డెర సంఘాలు రాబోయే శాసనసభ ఎన్నికల్లో హరీష్‌రావును ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని తీర్మాన పత్రాలను అందజేశారు.
ఆత్మనూన్యతతో ఉండొద్దు
సిద్దిపేటజోన్: మహిళలు సహనంతో అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఆత్మ నూన్యతతో ఉండొద్దని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం స్థానిక విపంచి ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర మహిళ సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు శిక్షణ, బ్యుటీషియన్ శిక్షణ పూర్తి చేసుకున్న కిశోర బాలికలకు రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆకుల లలిత తో కలిసి మంత్రి హరీశ్ రావు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
శంకరమఠం సోలార్ సిస్టం ప్రారంభం
సిద్దిపేటఅర్బన్: మండలంలోని కిష్టసాగర్‌లో గల శృంగేరి శంకరమఠంలో ఏర్పాటు చేసిన సోలార్ సిస్టంను ఆదివారం మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. సౌరశక్తిని వినియోగించుకోవడం వల్ల పర్యావరణ పరిరక్షణకు పాటుపడిన వాళ్లమవుతామని మంత్రి అన్నారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ విజిత, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, రాజనర్సు, కనకరాజు, రామచంద్రరావు, మోహిజ్, తిరుమాల్, శ్రీహరి, సుందర్, మల్లికార్జున్, రఘురాం, సురేష్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.
లింగారెడ్డిపల్లి రూట్‌లో
రూ.60కోట్లతో ఫోర్‌లేన్ రోడ్డు
ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment