సుడా.. ఇంకెప్పుడు బడా?
సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా)ని విస్తరించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ నేటికీ అమలు కావడంలేదు. సిద్దిపేట మున్సిపాలిటీ , 26 గ్రామాలే కాకుండా జిల్లా అంతటా విస్తరించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు విస్తరణకు అడుగు ముందుకు పడటంలేదు. దీంతో విస్తరణ ఉంటుందా? ఉండదా? అని పలువురు చర్చించుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు వెళ్లే మార్గం నుంచి రెండు కిలోమీటర్ల వరకు (మహానగరాభివృద్ధి సంస్థ) హెచ్‌ఎండీఏను విస్తరించాలని, మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణించాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉత్తర్వులిచ్చారు.. విస్తరణ మరిచారు
● ఆదేశాలిచ్చి నేటికి నాలుగు నెలలు
● ఇష్టారాజ్యంగా వెలుస్తున్న వెంచర్లు
● పట్టించుకోని అధికారులు
● డీటీసీపీ విలీనం జరిగేనా?
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా) అక్టోబర్ 30, 2017న ఏర్పాటుచేశారు. సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 26 గ్రామాలతో సుడా పురుడు పోసుకుంది. సుడా విస్తరణ కోసం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న వర్గల్, ములుగు, మర్కూక్ మండలాలు కాకుండా మిగతా మండలాలను కలిపేందుకు కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. వాటిని పరిశీలించి గతేడాది అక్టోబర్ 15న పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. నేటికీ నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలు కావడం లేదు.
నాలుగు మున్సిపాలిటీలు.. 286 గ్రామాలు
డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) పరిధిలో గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలతో పాటు 22 మండలాల పరిధిలోని 286 గ్రామాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు డీటీసీపీని సుడాలో కలపలేదు. కొత్తగా ఉత్తర్వులు జారీ చేసిన దానిలో సిద్దిపేట అర్బన్, రూరల్, నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగనూరు, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్, అక్బర్‌పేట–భూంపల్లి, రాయపోలు, గజ్వేల్, కొండపాక, కుకునూరుపల్లి, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, మద్దూరు, చేర్యాల, కొమురవెల్లి, బెజ్జంకి, దూల్మిట్ట మండలాలు రానున్నాయి. సుడా పరిధిలోకి వెళ్లాయని గ్రామ పంచాయతీ అధికారులు, మున్సిపల్ అధికారులు ఆక్రమ లేఔట్‌ల పై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోతోంది. సుడా విస్తరణ జరిగితే ఆక్రమ లేఔట్‌లకు చెక్ పడనుంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి విస్తరణ చేయాలని పలువురు కోరుతున్నారు.
ఇంకా క్లారిటీ రాలేదు..
సుడా విస్తరణపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. సుడాతో పాటు మిగతా పట్టణాభివృద్ధి సంస్థలకు సైతం వచ్చాయి. వాటిని ఇంకా ఏర్పాటు చేయలేదు. సుడా విస్తరణపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే డీటీసీపీ విలీనం అవుతుంది.
– అశ్రిత్ కుమార్, వీసీ, సుడా
సుడా.. ఇంకెప్పుడు బడా?
Comments
Please login to add a commentAdd a comment