
జాతీయ రహదారి భూ సర్వే అడ్డగింత
● అధికారుల తీరుపై బాధితుల ఆగ్రహం ● ఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు ● పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు ● చేసేది లేక వెనుదిరిగిన అధికారులు
కొండపాక(గజ్వేల్): జప్తినాచారం గ్రామ శివారులో జాతీయ రహదారి నిర్మాణ సర్వే పనులను శుక్రవారం భూనిర్వాసితులు అడ్డుకున్నారు. సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు జాతీయ రహదారి నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో అధికారులు సర్వే చేసి పట్టా భూముల్లో హద్దులు పాతారు. ఇటీవల సర్వే అధికారులు పెట్టిన హద్దులను పరిశీలించడానికి నేషనల్ హైవే రీజినల్ అధికారి కృష్ణ ప్రసాద్ వస్తున్నారన్న సమాచారం మేరకు జప్తినాచారం, దుద్దెడ, మర్పడ్గ, ఖమ్మంపల్లి, తడ్కపల్లి, ఎన్సానిపల్లి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బాధిత రైతులు జప్తినాచారం శివారులోకి ఉదయమే చేరుకున్నారు. రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వే చేయడం తగదని వారు వాపోయారు. సాయంత్రం 4 గంటలకు నేషనల్ హైవే నిర్వహణ ఉన్నతాధికారి రాకపోగా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్నయ్యతో అధికారులు సర్వే పనులను పరిశీలించడానికి వచ్చారు. దీంతో సమాచారం ఇవ్వకుండా పట్టా భూముల్లో ఎలా సర్వే చేస్తారంటూ బాధితులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేను చేయనిచ్చేది లేదంటూ అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు లేకుండా కేవలం నేషనల్ హైవే నిర్వహణ అధికారులు ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సర్వే పనులను అడ్డుకుంటారన్న ముందస్తు సమాచారం మేరకు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి, తొగుట, త్రీటౌన్ సీఐలు లతీఫ్, విద్యాసాగర్, ఎస్‌ఐ శ్రీనివాస్‌లతో పాటు సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయినా బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో చేసేది లేక సర్వే పనుల పరిశీలన కోసం వచ్చిన అధికారులు వెనుదిరిగారు. అంతకు ముందు హైవే రూట్ మ్యాప్‌ను మార్చుతూ తక్కువ భూములు కోల్పోయేలా చూడాలని ఇంజనీర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ రహదారి భూ సర్వే అడ్డగింత
Comments
Please login to add a commentAdd a comment