● దెబ్బతిన్న పంటలు ● దుబ్బాక–మల్లాయపల్లి మధ్య రాకపోకలు బంద్
దుబ్బాక: మల్లన్నసాగర్ కాల్వకు శుక్రవారం గండి పడింది. ప్రాజెక్టు నుంచి నీరు ఎక్కువగా వదలడంతో ఉధృతికి 4 ఎల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు మల్లాయపల్లి శివారులో గండిపడి నీరంత వృథాగా పోయింది. ఉధృతంగా నీరు ప్రవహించడంతో మల్లాయపల్లి ప్రధాన రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో దుబ్బాక–మల్లాయపల్లి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. మల్లన్నసాగర్ 4ఎల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ను పలు గ్రామాల చెరువులతో పాటు రాజన్నసిరిసిల్ల జిల్లా కొత్తపల్లి వరకు చెరువులు, కుంటలతో పాటు పంటలకు నీరందిచేందుకు నిర్మించారు. కాల్వకు చాలా చోట్ల సీసీ పోయకుండా వదిలేశారు. దీంతో ప్రధాన కెనాల్ నుంచి నీరు ఎక్కువగా వదలడంతో గండిపడింది. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని గండిపడ్డ కాల్వను పూడ్చేందుకు ప్రయత్నించినప్పటికీ నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాలేదు. కొట్టుకుపోయిన రోడ్డు ఇరువైపులా బారికేడ్లను పెట్టి ఎవరూ వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కెనాల్ నుంచి నీటిని నిలిపివేశామని శనివారం ఉదయం లోగా నీటి ఉధృతి తగ్గుతుందని అన్నారు. నీరు తగ్గాక గండిపూడ్చడంతో పాటుగా రోడ్డు మరమ్మతు పనులు చేపడతామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కాగా కాల్వకు గండిపడి నష్టం జరిగిన పంటలకు నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కొట్టుకుపోయిన దుబ్బాక–మల్లాయపల్లి రోడ్డు
Comments
Please login to add a commentAdd a comment