
‘స్వశక్తి’కి బిల్లులేవి?
● జిల్లాలో సంక్షేమ హాస్టల్ విద్యార్థుల దుస్తుల సరఫరా ● నాలుగేళ్ల నుంచి రూ.34.80 లక్షల బిల్లులు పెండింగ్‌లోనే ● టోకెను ఇచ్చిన ఖాతాలో జమకాని డబ్బులు
స్వయం ఉపాధితో ఆర్థిక ప్రగతి సాధించాలని స్వశక్తి సంఘాల మహిళలు ఆశ పడ్డారు. అధికారులు చెప్పగానే నెలనెలా ఉపాధి పొందవచ్చని టైలరింగ్ ప్రారంభించారు. అయితే మహిళల చేత కుట్టుపని చేయించిన అధికారులు బిల్లులు ఇప్పించడంలో మాత్రం ముఖం చాటేస్తున్నారు. దీంతో స్వశక్తి మహిళల్లో
అసహనం వ్యక్తమవుతోంది.
హుస్నాబాద్‌రూరల్: జిల్లాలోని 18 బీసీ, 21 ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలోని దాదాపు 1500 మంది విద్యార్థులకు యేడాదికి నాలుగేసి డ్రెస్సులను స్వశక్తి మహిళలు కుట్టి అందించారు. వారికి ఇప్పటి వరకు రూ.34.80లక్షల బిల్లులు రావాల్సి ఉంది. వ్యవసాయ కూలీ పనులు మానేసి బట్టలు కుట్టే పనిచేశామని, నాలుగేళ్ల నుంచి బిల్లులు రాకపోతే ఇల్లు ఎట్లా గడుస్తుందని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే బకాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామంలో అరుంధతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో 30 మంది సభ్యులు సీ్త్ర శక్తి టైలరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. డీఆర్‌డీఏ అధికారులు మహిళాసంఘాల సభ్యులు అందరూ స్వయం ఉపాధి పొందాలని చెప్పగానే మొదట పోతారం మహిళలు ముందుకు వచ్చి సీ్త్ర నిధి రుణాలను తీసుకొని మిషన్లు కొనుగోలు చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కుట్టు శిక్షణతో ఉపాధి పొందిన మహిళలకు మొదట బిల్లులు బాగానే వచ్చేవి. అయితే నాలుగేళ్ల నుంచి రూ.30లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కుట్టు పనినే నమ్ముకొన్న ఆ మహిళలకు పిల్లల స్కూల్ ఫీజులు, నెలనెలా రుణాలు చెల్లించడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీసీ సంక్షేమశాఖ హాస్టల్ విద్యార్థుల డ్రెస్సులు ఈ యేడాది ఇవ్వకపోయినా పాత బిల్లులు చెల్లించడం లేదని మహిళలు వాపోతున్నారు.
పెండింగ్‌లో రూ.1.80 లక్షల బిల్లులు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల డ్రెస్సులు కుడితే ఒక్కొక్క డ్రెస్సుకు రూ.75లు ఇస్తామని చెప్పిన అధికారులు రూ.50ల చొప్పున చెల్లించారు. మిగతా రూ.25ల చొప్పున రూ.3లక్షల వరకు రావల్సి ఉంది. వాటితో పాటు ఇటీవల అంగన్‌వాడీ కేంద్రాల పిల్లల డ్రెస్సులు కుట్టుపని అప్పగించడంతో వారికి 2024 సెప్టెంబరులోనే డ్రెస్సులు అందించారు. అయినా నేటికీ రూ.1.80లక్షల బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదు. అధికారులు బిల్లులు చెల్లించి మహిళలను ఆదుకోవాలని కోరుతున్నారు.
కుట్టుపనిలో నిమగ్నం
మిషన్ కుడితేనే ఇల్లు గడుస్తది
బట్టలు కుడితే రోజుకు రూ.1500 నుంచి రూ.2వేలు వస్తయి. ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి బిల్లులు ఇయ్యక పోవడంతో నెలనెలా మహిళా సంఘం రుణం చెల్లించడం ఇబ్బంది అవుతోంది. కుట్టుపని ఉందని బయట కూలిపనికి పోతలేం. పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుడు కూడా తిప్పలైతంది. బిల్లులు వస్తాయని అప్పులుచేస్తే వాటికి వడ్డీలు పెరుగుతున్నా బిల్లులు రావాయె.. అవసరం తీరదాయే. – పి.లక్ష్మి, పోతారం(ఎస్)
సచివాలయం చుట్టూ తిరగాలంటే ఎట్లా..
హాస్టల్ విద్యార్థుల డ్రెస్సులు కుట్టిన బిల్లులు రూ.30 లక్షలు రావాల్సి ఉంది. ఆఫీసుల చుట్టూ తిరిగితే బీసీ సంక్షేమశాఖ రూ.10లక్షలు, ఎస్సీ సంక్షేమశాఖ రూ..10లక్షలకు టోకెన్స్ ఇచ్చాయి. మూడు నెలలు గడిచినా డబ్బులు జమకాలేదు. టోకెన్ పట్టుకొని హైదరాబాద్ సచివాలయం చుట్టూ తిరగాలంటే ఎట్లా అయితది. తక్షణం కలెక్టర్ చొరవ చూపాలి.
– కనకతార, సీఏ, పోతారం

‘స్వశక్తి’కి బిల్లులేవి?

‘స్వశక్తి’కి బిల్లులేవి?
Comments
Please login to add a commentAdd a comment