సమీకృత గురుకులానికి రూ.200 కోట్లు
● నిర్మాణానికి నిధులు మంజూరు ● ఇప్పటికే తంగళపల్లిలో భూమిపూజ చేసిన మంత్రి పొన్నం ● సుమారు 25 ఎకరాల్లో నిర్మాణానికి చర్యలు ● అంతర్జాతీయ స్థాయిలో అందనున్న విద్య
కోహెడరూరల్(హుస్నాబాద్): అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా విద్యను అందించే లక్ష్యంతో కోహెడ మండలంలోని తంగళపల్లిలో సమీకృత గురుకుల పాఠశాలను నిర్మించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ ఇటీవలే గ్రామ శివారులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో 5 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు బోధన అందనుంది.
అంతర్జాతీయ స్థాయి బోధన
సమారు 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి పిల్లలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో అంతర్జాతీయ స్థాయిలో విద్య అందించనున్నారు. ఈ సమీకృత గురుకులంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలన్నీ ఒకే ప్రాంగణంలోకి వస్తాయి. 5 నుంచి 12వ తరగతి వరకు నిర్వహిస్తారు. విద్యార్థులకు లైబ్రరీలతో పాటు కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. అన్ని తరగతులు డిజిటల్ బోర్డుల ద్వారా బోధించనున్నారు.
కార్పొరేట్‌కు దీటుగా విద్య
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థులకు అన్ని తరగతుల్లో కంప్యూటర్, డిజిటల్ బోర్డుల ద్వారా బోధన జరగనుంది. చదవుల పేరిట ఒత్తిడి స్పష్టించే వాతావరణం కాకుండా క్రీడలు, వినోదం వంటిని విద్యార్థులకు అందుతాయి. ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరుకు కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కుకు ప్రత్యేక కృతజ్ఞలు.
– పొన్నం ప్రభాకర్, బీసీ, రవాణా శాఖ మంత్రి
సమీకృత గురుకులానికి రూ.200 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment