అర్జీలు సత్వరం పరిష్కారం
● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ● అధికారులకు దిశానిర్దేశం ● ప్రజావాణికి వచ్చిన అర్జీలు 54
సిద్దిపేటరూరల్: ప్రజవాణి కార్యక్రమంలో అందించిన అర్జీలను సత్వరం పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారంపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అర్జీలు పరిష్కరించడం ద్వారా ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుందన్నారు. పలు సమస్యలపై 54 దరఖాస్తులు వచ్చాయి.
గ్రామాభివృద్ధికి
నిధులు కేటాయించండి
కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని తపాస్‌పల్లి గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న గ్రామపంచాయతీ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హల్, బస్ షెల్టర్ ,పాఠశాల ప్రహరీ నిర్మాణానికి నిధుల కేటాయించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ స్పందించి అసంపూర్తిగా ఉన్న పనులకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో పుట్ట నర్సింహులు, ఈగ కనకయ్య, రమేష్ తదితరులు ఉన్నారు.
చెరువులను నింపండి
కొండపాక(గజ్వేల్): చెరువులు నింపి సాగునీటిని అందించాలని రైతులు కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీరు వెళ్లేందుకు ఆగిపోయిన కాలువ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ను కోరారు. మేదినీపూర్, లకుడారం గ్రామాల రైతులు కాలువ తవ్వకాల్లో భూములు కోల్పోతున్నారని అన్నారు. వారికి పరిహారం అందకపోవడంతో కాలువ తవ్వకం పనులను నిలిపివేస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. మర్పడ్గ, రాంపల్లి శివారుల్లో ఆగిపోయిన కాలువ పనుల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment