పొట్ట దశలో పుట్టెడు కష్టాలు
పక్క చిత్రంలో రైతు పేరు శతవేణి కొమురయ్య.. కోహెడ మండలం రామచంద్రాపూర్‌కు చెందిన ఈ రైతు.. మోయతుమ్మెద వాగు శివారులో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. వరి సాగు చేశాడు. పంట పొట్ట దశలో ఉండగా.. నీరందక పొలం ఎండిపోయింది. ఇప్పటికే పంట కోసం రూ.80వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒక్క రైతు పరిస్థితే కాదు జిల్లాలో పంటలు సాగు చేస్తున్న దాదాపు అందరిదీ ఇదే దుస్థితి.
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో గత అక్టోబర్ వరకు వర్షాలు కురిశాయి. దీంతో యాసంగిలో వరి సాగుకు ఏమాత్రం ఢోకా లేదని భావించారు. చెరువులు, వాగులు, బోరుబావులపై ఆధారపడి.. ఎక్కువ మంది రైతులు వరి సాగుకే మొగ్గు చూపారు. వారందరూ ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న ఎండలకు బోరుబావుల్లో భూగర్భజలాలు అడుగంటాయి. కొత్త బోర్లు వేసినా.. ఫలితం కానరావడంలేదు. పొట్టదశలో ఉన్న వరి పైరును కాపాడుకోలేని నిస్సహాయస్థితిలో జీవాలకు మేతగా వదిలేస్తున్నారు. వరి, మొక్కజొన్న పంటల పరిస్థితి చూసి, జిల్లా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
మరో నెల రోజుల్లో చేతికి..
మరో నెల నుంచి నెలన్నర రోజుల్లో చేతికి వచ్చే పంటలు ఎండిపోతున్నాయి. కొన్ని చోట్ల వరి పొలాలను రైతులు అర్ధంతరంగా వదిలేస్తున్నారు. మరికొందరు కొత్త బోర్లను తవ్వుతున్నా.. నీటి జాడ అందడంలేదు. కొందరు ట్యాంకర్లతో నీటి తడులందిస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండిపోయిన పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించి రైతులకు సూచనలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.50లక్షల ఎకరాల్లో సాగవుతుండగా వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం 2,094 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. జిల్లాలో సగటున భూగర్భ జలాలు 12.13మీటర్ల లోతుకు పడిపోయాయి.
మండలం ఎండిపోయిన ఎకరాలు
చేర్యాల 300
కొమురవెల్లి 350
దూల్మిట్ట 15
మద్దూరు 15
దుబ్బాక 168
కొండపాక 190
అక్కన్నపేట 305
కోహెడ 152
జగదేవ్‌పూర్ 58
హుస్నాబాద్ 91
సిద్దిపేట అర్బన్ 45
తొగుట 48
సిద్దిపేట రూరల్ 50
మిరుదొడ్డి 77
దౌల్తాబాద్ 25
బెజ్జంకి 45
రాయపోల్ 40
చిన్నకోడూరు 20
అక్బర్‌పేట భూంపల్లి 90
నీరందక పంట పొలాలన్నీ నెర్రలు
ఇప్పటికే 2వేల ఎకరాలకుపైగా
ఎండిన పంటలు
మండుతున్న ఎండలతో
అడుగంటుతున్న భూగర్భ జలాలు
చేసేదిలేక జీవాలకు మేతగా పంట చేన్లు
ఆదుకోవాలని కోరుతున్న రైతులు
పొట్ట దశలో పుట్టెడు కష్టాలు
Comments
Please login to add a commentAdd a comment