కొండపాక(గజ్వేల్): గ్రామాల్లో తాగునీటికీ తండ్లాట తప్పడంలేదు. మిషన్ భగీరథ పథకం మంచి నీటి సరఫరాను పట్టించుకునేవారేలేరు. దీంతో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుకునూరుపల్లి మండలం లకుడారంలో సుమారు 1800 జనాభా ఉంటుంది. కోమటి బండ నుంచి గ్రామానికి భగీరథ పథకం నుంచి నీరు సరఫరా చేసేవారు. ఈక్రమంలో గ్రామానికి నీటి సరఫరా అయ్యే పైపులైన్ దెబ్బతిన్నది. పది రోజలవుతున్నా మరమ్మతుకు నోచుకోవడంలేదు. దీంతో గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా ఒక్కసారే సరఫరా చేస్తుండటంతో స్థానికులు పిల్లపాపలతో క్యూ కట్టాల్సి వస్తోంది. వ్యవసాయ బోరుబావుల నుంచి తెచ్చుకుందామన్నా ఎండాకాలం కావడంతో రైతులు అడ్డుచెబుతున్నారు. అధికారులు స్పందించి భగీరథా పథకం ద్వారా తాగు నీరు సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు. ఈవిషయమై గ్రిడ్ ఏఈ వెంకటేశ్‌ను వివరణ కోరగా కోమటిబండ వద్ద నీటి కొరత ఏర్పడటంతో నీటి సమస్య ఏర్పడిందన్నారు. రెండు మూడు రోజుల్లో నీరు సరఫరా అయ్యేలా చూస్తామన్నారు.
లకుడారంలో నీటి గోస
ట్యాంకర్ ద్వారా సరఫరా
బిందెడు నీటి కోసం పిల్లాపాపలతో క్యూ