
నెత్తిన ‘బండ’
నేటి నుంచి ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెంపు
● రూ.855 నుంచి రూ.905లకు చేరిన ధర
● జిల్లా వ్యాప్తంగా 3.23లక్షల కనెక్షన్లు
● ప్రతి నెలా రూ.సుమారు 75లక్షల భారం
సాక్షి, సిద్దిపేట: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. కేంద్రం ఒక్కో సిలిండర్ పై ఏకంగా రూ.50లు పెంచింది. ఇప్పటికే బియ్యం, నూనె, పప్పులు వంటి నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలపై తాజాగా పెరిగిన గ్యాస్ ధర మరింత భారం కానుంది. ప్రస్తుతం 14.2కిలోల గ్యాస్ సిలిండర్ రూ.855 ఉండగా రూ.50లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రూ.905లకు చేరింది. జిల్లా వ్యాప్తంగా 3,23,500 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో ప్రతి నెలా ఒక్కో సిలిండర్ చొప్పున 1.5లక్షల మంది వినియోగిస్తున్నారు. దీంతో కుటుంబాలపై ప్రతి నెలా దాదాపుగా రూ.75లక్షల భారం పడనుంది. ఈ పెంపు ఉజ్వల పథకం కింద తీసుకున్న కనెక్షన్లకు సైతం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రేషన్ కార్డు కలిగిన పేద, మధ్య తరగతి కుటుంబాలకు రూ.500లకు సిలిండర్‌ను అందజేస్తోంది. జిల్లాలో 1,62,257 మందికి రూ. 500లకే గ్యాస్ సిలిండర్‌ను ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద రూ. 500లకు అందజేస్తున్న సిలిండర్ ధరను సైతం రూ.550లకు పెంచడంతో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు పెంచుతుందా? అనే నిర్ణయం తేలాల్సి ఉంది. మహాలక్ష్మి లబ్ధిదారుల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఈ ధర ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కువగా పడనుంది.