
వడగళ్ల వాన బీభత్సం
అక్కన్నపేట మండలంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన వడగళ్ల వానతో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం అంతా తడిసి ముద్దయింది. చాలా వరకు ధాన్యం కొట్టుకుపోయింది. ఐదు రోజుల కిందటే అమ్మకానికి ధాన్యం తీసుకొచ్చినా కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చేయడంతో చేసిన కష్టం అంతా వర్షార్పణమైందని రైతులు వాపోయారు. అలాగే మండలంలోని పలు ప్రాంతాల్లో చేతికందే వరి పంటలు సైతం నేలకొరిగాయి. అక్కన్నపేట, పంతుల్‌తండా, చాపగానీతండా, కన్నారం గ్రామాల్లో వడగళ్ల వానతో పలు పంటలు దెబ్బతిన్నాయని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు.
– అక్కన్నపేట(హుస్నాబాద్)