
రైతులకు భూ భారతి వరం
దుబ్బాక: ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం రైతులకు వరమని ఆర్డీఓ సదానందం అన్నారు. మంగళవారం దుబ్బాక ఐఓసీలో భూ భారతిపై రైతులకు అవగాహన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఈ చట్టంతో రైతులకు కలిగే లాభాలను వివరించారు. రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంజీవ్‌కుమార్, ఎంపీడీఓ భాస్కరశర్మ, ఆర్‌ఐ నరేందర్, మండలంలోని రైతులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.
సమస్యలు ఇక సత్వర పరిష్కారం
మిరుదొడ్డి(దుబ్బాక): భూ భారతితో రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టం గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఆర్‌ఓఆర్ 2025 చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. భూ భారతి ద్వారా చేకూరే ప్రయోజనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి సమస్యల పరిష్కారం కోసం భూ భారతి పోర్టల్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి, ఎంపీడీఓ జైపాల్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సత్యాణ్వేష్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి నాగేశ్వర్‌రావు, ఆర్‌ఐ వెంకట్ నర్సయ్య, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.