
అవసరమే కాదు ఆసక్తి కూడా కొత్త భాషను దగ్గర చేస్తుందని మలయాళ భాషను గడగడా మాట్లాడే ఎలిజెబెత్ కీటోన్‌ను చూస్తే అర్థమవుతుంది. జార్జియా (యూఎస్)కు చెందిన ఎలిజబెత్ ఇంగ్లీష్ టీచర్. కొత్త భాషలు నేర్చుకోవడం అంటే ఇష్టం. సౌత్‌కొరియా ఆ తరువాత యూఏఈలో ఇంగ్లీష్ పాఠాలు చెప్పింది. దుబాయ్‌లో ఉన్నప్పుడు మలయాళీ కుర్రాడు అర్జున్‌తో ఎలిజబెత్‌కు పరిచయం అయింది, ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లయింది. ఇక అప్పటి నుంచి శ్రీవారి మాతృభాషను నేర్చుకోవాలని డిసైడై పోయింది ఎలిజ బెత్.
‘30 రోజుల్లో మలయాళం’లాంటి ఔట్‌డేటెడ్ పుస్తకాలు, మార్గాలు తప్ప కొత్తవి కనిపించలేదు. దీంతో కోళికోద్‌లో ఉన్న ఒక టీచర్ ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో మలయాళం భాష నేర్చుకోవడం మొదలుపెట్టింది. అయితే సాంకేతిక కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తనదైన స్టైల్లో సొంతంగా నోట్స్ రాసుకొని, డూడుల్స్ తయారు చేసుకొని మలయాళ భాషపై పట్టు సంపాదించింది. ‘ఎలి.కుట్టీ’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తి ఉన్నవారికి మలయాళం నేర్పుతోంది.