33 మ్యాచ్‌ల్లో వంద గోల్స్‌.. ఆల్‌టైమ్ రికార్డు ఎంతో తెలుసా? | 100 Goals-33 Games But-All-Time Record Not-Broken FIFA History | Sakshi
Sakshi News home page

33 మ్యాచ్‌ల్లో వంద గోల్స్‌.. ఆల్‌టైమ్ రికార్డు ఎంతో తెలుసా?

Jun 21 2026 3:12 PM | Updated on Jun 22 2026 10:44 AM

100 Goals-33 Games But-All-Time Record Not-Broken FIFA History

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఫిఫా క్రేజ్ నడుస్తోంది. ఏ దేశం చూసినా ఫుట్‌బాల్ మత్తులోనే తేలియాడుతోంది. గోల్స్ వర్షంలో అభిమానులు తడిసి ముద్దవుతున్న వేళ ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ కొత్త చరిత్ర సృష్టించింది. ఫిఫా చరిత్రలో 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా 100 గోల్స్ నమోదైన ఎడిషన్‌గా 2026 ఫిఫా టోర్నీ నిలిచింది.  1958 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో 32 లేదా 33 మ్యాచ్‌ల్లో వంద గోల్స్ న‌మోదైన‌ట్లు రికార్డుల్లో ఉంది.

ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ మైలురాయిని చేరుకోవడం విశేషం. కాగా ప్రపంచకప్‌లో ఈసారి తొలి గోల్‌ను సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మెక్సికో ఆటగాడు జూలియన్ క్వినోనెస్  నమోదు చేయగా.. వందో గోల్‌ను నెదర్లాండ్స్ స్టార్ ఆటగాడు కోడీ గాకో కొట్టాడు. స్వీడన్‌తో మ్యాచ్‌లో కోడీ గోల్ కొట్టడం ద్వారా టోర్నీలో వందో గోల్ వచ్చింది. 

ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 5-1 తేడాతో స్వీడన్‌ను చిత్తు చేసింది. కాగా ఫిఫా చరిత్రలో 33 మ్యాచ్‌ల్లో వంద గోల్స్ చేరుకోవడమనేది సరికొత్త రికార్డుగా పేర్కొనవచ్చు. గతంలో 1982, 2014 ప్రపంచకప్పుల్లో వంద గోల్స్ చేరడానికి 36 మ్యాచ్‌లు, 1978, 1994 టోర్నీల్లో 38 మ్యాచ్‌లు అవసరమయ్యాయి.

అయితే 1954లో స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో మాత్రం కేవలం 20 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదవ్వడం ఇప్పటికీ ఆల్‌టైమ్‌ రికార్డుగా ఉంది. ఈ రికార్డును అందుకోవడం ఇప్పట్లో కష్టతరమే. అంతేకాదు నెదర్లాండ్స్ జట్టు కూడా మరో అరుదైన ఘనత సాధించింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో 100 గోల్స్ క్లబ్‌లో చేరిన ఎనిమిదో దేశంగా నెదర్లాండ్స్ నిలిచింది. 

స్వీడన్‌తో మ్యాచ్‌లో బ్రియాన్ బ్రోబ్బే రెండు గోల్స్ సాధించగా.. అతని రెండో గోల్ నెదర్లాండ్‌కు ఫిఫా ప్రపంచకప్లలో 100వ గోల్‌గా నిలిచిపోయింది. మొత్తం మీద అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో 48 దేశాలు పాల్గొంటున్నాయి. 

Read: ఫిఫాలో 1000వ మ్యాచ్‌.. జపాన్‌ గర్జనకు ట్యునీషియా చిత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement