Asian Games: జ్యోతి సురేఖకు షాకిచ్చిన 14 ఏళ్ల సంచ‌ల‌నం | 14 Years-Archer-Kang-Yeon-Seo-Defeated-Jyothi-Surekha-Asian Games | Sakshi
Sakshi News home page

Asian Games: జ్యోతి సురేఖకు షాకిచ్చిన 14 ఏళ్ల సంచ‌ల‌నం

Sep 28 2026 4:28 PM | Updated on Sep 28 2026 4:35 PM

14 Years-Archer-Kang-Yeon-Seo-Defeated-Jyothi-Surekha-Asian Games

ఆసియా గేమ్స్‌లో ఆర్చ‌రీ మ‌హిళ‌ల కాంపౌండ్ వ్య‌క్తిగ‌త విభాగంలో భార‌త స్టార్, డిఫెండింగ్ చాంపియ‌న్ జ్యోతి సురేఖ‌కు ఊహించ‌ని షాక్ ఎదురైంది. వ్య‌క్తిగ‌త విభాగంలో దేశానికి క‌చ్చితంగా ప‌తకం తెస్తుంద‌ని భావించిన‌ప్ప‌టికీ, జ్యోతి సురేఖ ప్రిక్వార్ట‌ర్స్‌లోనే ఇంటిబాట ప‌ట్టి నిరాశ ప‌రిచింది. 

అయితే ద‌క్షిణ కొరియాకు చెందిన 14 ఏళ్ల కాంగ్ యోన్సియో చేతిలో సురేఖ ఓట‌మి పాల‌వ్వ‌డం అభిమానుల‌ను షాక్‌కు గురి చేసింది. ప్రిక్వార్ట‌ర్స్‌లో కాంగ్ యోన్సియో చేతిలో 150-146 తేడాతో సురేఖ ఓట‌మి చ‌విచూసింది. ఆరు సెట్ల సిరీస్‌గా జ‌రిగిన మ‌హిళ‌ల ఆర్చ‌రీ వ్య‌క్తిగ‌త కాంపౌండ్ ఈవెంట్లో 14 ఏళ్ల కాంగ్ యోన్సియో ఆరు సెట్లు క‌లిపి 150 స్కోరు సాధించ‌గా.. జ్యోతి సురేఖ 146కే ప‌రిమిత‌మైంది. 

రెండో సిరీస్‌లో జ్యోతి సురేఖ మూడుసార్లు 10 పాయింట్లు సాధించ‌గా.. కాంగ్ ఆమెను స‌మం చేసింది.  ఇక మూడో సిరీస్‌లోనూ కాంగ్ మూడుసార్లు ప‌ది పాయింట్లు స్కోరు చేయ‌గా, సురేఖ త‌న చివ‌రి సెట్‌లో 9 పాయింట్లే న‌మోదు చేసి పోటీలో వెనుక‌బ‌డిపోయింది. 2011 న‌వంబ‌ర్ 1న జ‌న్మించిన కాంగ్ యోన్సియో ద‌క్షిణ కొరియా జాతీయ జ‌ట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వ‌య‌స్కురాలైన ఆర్చ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించింది.

కాంగ్ యోన్సియో 701 పాయింట్లు సాధించి ర్యాంకింగ్ రౌండ్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఆమె ప్రదర్శనతో దక్షిణ కొరియా మహిళల టీమ్ పోటీలో 2,096 పాయింట్లు సాధించి,  చైనా, భారత్‌ల తర్వాత మూడో స్థానంలో నిలిచింది. కాంగ్ యోన్సియో అదే ఫామ్‌ను వ్యక్తిగత డ్రాలోనూ కొనసాగించింది. రౌండ్ ఆఫ్ 32లో మంగోలియాకు చెందిన ఒట్గోన్‌బయార్ డాగ్డ్జావ్‌ను 150-133 తేడాతో సునాయాసంగా ఓడించిన కాంగ్, తాజాగా రౌండ్ ఆఫ్ 16లో డిఫెండింగ్ చాంపియ‌న్‌ సురేఖ‌కు షాక్ ఇచ్చి క్వార్ట‌ర్స్‌కు దూసుకెళ్లింది.  

ఇక వ్య‌క్తిగ‌త విభాగంలో జ్యోతి సురేఖ నిరాశ‌ప‌రిచిన‌ప్ప‌టికీ, గ్రూప్ ఈవెంట్‌లో మాత్రం భార‌త పురుషుల‌, మ‌హిళ‌ల కాంపౌండ్ జ‌ట్లు సెమీస్‌లోకి ప్ర‌వేశించి ప‌త‌కం రేసులో నిలిచాయి. జ్యోతి సురేఖ‌, తానిప‌ర్తి చికిత‌, ప్ర‌తీక‌ల‌తో కూడిన భార‌త జ‌ట్టు క్వార్ట‌ర్ ఫైన‌ల్లో 233-230 తేడాతో క‌జ‌కిస్తాన్‌ను ఓడించింది. ఇక పురుషుల కాంపౌండ్ విభాగంలో కుశాల్ ద‌లాల్‌, సాహిల్ జాద‌వ్‌, గ‌ణేశ్‌ల‌తో కూడిన జ‌ట్టు 235-232 తో భూటాన్‌ను ఓడించింది.

ఇదీ చదవండి: అప్పుడు ప‌త‌కం అందిస్తే.. ఇప్పుడు ఇంటికి సాగ‌నంపింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement