నగోయాలో కలుద్దాం! | 19th Asian Games concluded at the Hangzhou Olympics Stadium | Sakshi
Sakshi News home page

నగోయాలో కలుద్దాం!

Published Mon, Oct 9 2023 3:52 AM | Last Updated on Mon, Oct 9 2023 7:22 PM

19th Asian Games concluded at the Hangzhou Olympics Stadium - Sakshi

హాంగ్జౌ: గత 16 రోజులుగా క్రీడాభిమానులను ఆద్యంతం అలరించిన ఆసియా క్రీడా సంరంభానికి ఆదివారం తెర పడింది. సెప్టెంబర్ 23న చైనాలోని హాంగ్జౌ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన 19వ ఆసియా క్రీడలు అక్టోబర్‌ 8న అంతే ఘనంగా ముగిశాయి. 80 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన ‘బిగ్‌ లోటస్‌’ స్టేడియంలో 75 నిమిషాలపాటు ముగింపు వేడుకలు జరిగాయి. 45 దేశాలకు చెందిన క్రీడాకారులు మైదానంలోకి రాగా... చైనా సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

చైనా ప్రీమియర్‌ లీ కియాంగ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఓసీఏ) తాత్కాలిక అధ్యక్షుడు, భారత మాజీ దిగ్గజ షూటర్‌ రణ్‌ధీర్‌ సింగ్‌ 19వ ఆసియా క్రీడలు ముగిశాయని అధికారికంగా ప్రకటించారు. ‘గత 16 రోజుల్లో మనమంతా ఎన్నో చిరస్మరణీయ ఘట్టాలను తిలకించాం. హాంగ్జౌకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అద్భుతంగా ఆతిథ్యం ఇచ్చి న హాంగ్జౌను ఆసియానే కాకుండా మొత్తం ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది. ఈ సందర్భంగా చైనా ప్రభుత్వానికి, చైనా ఒలింపిక్‌ కమిటీకి, నగర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని రణ్‌దీర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

తదుపరి 20వ ఆసియా క్రీడలు 2026లో సెపె్టంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జపాన్‌లోని ఐచి రాష్ట్ర రాజధాని నగోయా నగరంలో జరుగుతాయి. ముగింపు వేడుకల్లో ఐచి రాష్ట్ర గవర్నర్‌ ఒమురా హిడెకి, నగోయా నగర డిప్యూటీ మేయర్‌ నకాటా హిడియో ఆసియా క్రీడల జ్యోతితోపాటు ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ పతాకాన్ని అందుకున్నారు.  

ముగింపు వేడుకల్లో భారత బృందానికి స్వర్ణ పతకం నెగ్గిన పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ పతాకధారిగా వ్యవహరించాడు. చాలా మంది భారత క్రీడాకారులు ఇప్పటికే స్వదేశానికి చేరుకోగా, ముగింపు వేడుకల్లో వంద మంది వరకు క్రీడాకారులు, అధికారులు పాల్గొన్నారు.  

మొత్తం 45 దేశాల నుంచి 40 క్రీడాంశాల్లో 12,407 మంది క్రీడాకారులు హాంగ్జౌలో పోటీపడ్డారని నిర్వాహకులు తెలిపారు.  

మూడోసారి ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చి న చైనా మరోసారి తమ ఆధిపత్యం చాటుకొని హాంగ్జౌలోనూ ‘టాప్‌’ ర్యాంక్‌లో నిలిచింది. చైనా 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలతో మొత్తం 383 పతకాలు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 188 పతకాలతో జపాన్‌ రెండో స్థానంలో, 190 పతకాలతో దక్షిణ కొరియా మూడో స్థానంలో, 107 పతకాలతో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచాయి. ఓవరాల్‌గా దక్షిణ కొరియా కంటే జపాన్‌ రెండు తక్కువ పతకాలు గెలిచినా... కొరియాకంటే ఎక్కువ స్వర్ణ పతకాలు గెలిచినందుకు జపాన్‌ రెండో ర్యాంక్‌లో నిలిచింది. 

హాంగ్జౌ ఆసియా క్రీడల్లో 13 కొత్త ప్రపంచ రికార్డులు, 26 ఆసియా రికార్డులు, 97 ఆసియా క్రీడల రికార్డులు నమోదయ్యాయి.  

41 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో మొత్తం 45 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో 41 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి.  

హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఒక్క పతకం కూడా నెగ్గని దేశాలు (భూటాన్, ఈస్ట్‌ తిమోర్, మాల్దీవులు, యెమెన్‌). 

2 తొలిసారి బ్రూనై, ఒమన్‌ దేశాలు ఆసియా క్రీడల చరిత్రలో రజత పతకాలు గెలిచాయి.  

4 ఒకే ఆసియా క్రీడల్లో 100 పతకాల మైలురాయిని దాటిన నాలుగో దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా ముందే ఈ జాబితాలో ఉన్నాయి. 

11  వరుసగా పదకొండోసారి ఆసియా క్రీడల పతకాల పట్టికలో చైనా ‘టాప్‌’ ర్యాంక్‌లో నిలిచింది. తొలిసారి చైనా 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో తొలి స్థానం దక్కించుకుంది. అప్పటి నుంచి చైనా పతకాల పట్టికలో తన నంబర్‌వన్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంటోంది.  

201 తాజా ఆసియా క్రీడల్లో చైనా గెలిచిన స్వర్ణ పతకాలు. ఈ క్రీడల చరిత్రలో తొలిసారి పసిడి పతకాల్లో 200 మైలురాయిని దాటిన తొలి దేశంగా చైనా నిలిచింది. 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో చైనా అత్యధికంగా 199 స్వర్ణ పతకాలు గెలిచింది. 

వరుసగా తొమ్మిదోసారి ఆసియా క్రీడల్లో చైనా 100 అంతకంటే ఎక్కువ స్వర్ణ పతకాలు సాధించింది. 1990 బీజింగ్‌ ఆసియా క్రీడల్లో చైనా స్వర్ణాల్లో తొలిసారి ‘సెంచరీ’ నమోదు చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement