2023 వన్డే ప్రపంచకప్ హాజరు విషయంలో ఆల్‌టైమ్ హై రికార్డు సెట్ చేసింది. ఈ ఎడిషన్ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక హాజరు కలిగిన వరల్డ్‌కప్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ ప్రపంచకప్‌కు 1,250,307 మంది హాజరైనట్లు ఐసీసీ ప్రకటించింది. 13 వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇదే అత్యధిక హాజరు కలిగిన వరల్డ్‌కప్‌గా రికార్డైంది. ఇందులో ఒక్క ఫైనల్ మ్యాచ్‌కే లక్ష మంది వరకు ప్రేక్షకులు హాజరయ్యారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఆ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 92453 మంది హాజరయ్యారు.
ఇదిలా ఉంటే, నవంబర్ 19న జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైంది. ఛేదనలో ఆసీస్ ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ అనంతరం అద్భుతంగా పుంజుకుని ఆరోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. ట్రవిస్ హెడ్ (137).. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.
వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు.
రికార్డు స్థాయిలో ప్రేక్షకుల బ్రహ్మరథం
భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌ను రికార్డుస్థాయిలో ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. పది జట్లు పోటీపడిన ఈ మెగా ఈవెంట్ 48 మ్యాచ్‌లను 12,50,307 మంది ప్రేక్షకులు చూశారని ఐసీసీ ధ్రువీకరించింది. అంటే సగటున ఒక్కో మ్యాచ్‌కు 26000 మంది హాజరైనట్లు తెలిపింది. ఆసీస్, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించిన 2015 వన్డే ప్రపంచకప్‌ను 10,16,420 మంది వీక్షించి రికార్డు సృష్టించగా... దీన్ని తాజా ప్రపంచకప్ బద్దలుకొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment