CWC 2023 Final: బోల్తా కొట్టించింది పిచ్‌ వ్యూహమేనా? | CWC 2023 Final IND VS AUS: Fans Feel Pitch Tactic Miss Fired For Team India | Sakshi
Sakshi News home page

CWC 2023 Final: బోల్తా కొట్టించింది పిచ్‌ వ్యూహమేనా?

Published Tue, Nov 21 2023 1:59 PM | Last Updated on Tue, Nov 21 2023 2:42 PM

CWC 2023 Final IND VS AUS: Fans Feel Pitch Tactic Miss Fired For Team India - Sakshi

2023 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలుపొంది, అజేయ జట్టుగా నిలిచిన భారత్‌ ఆఖరి మెట్టుపై బోల్తా పడి మూడోసారి టైటిల్‌ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో చతికిలపడటం టీమిండియాకు కొత్తేమీ కానప్పటికీ, ఈ దఫా మాత్రం అభిమానులను తీవ్రంగా బాధ పెట్టింది. ఆశలు రేకెత్తించి, ఆఖరి మెట్టుపై ఉసూరుమనిపించడంతో ఫ్యాన్స్‌ బాధ వర్ణణాతీతంగా ఉంది. ఈ ఓటమి 140 కోట్ల మంది భారతీయులకు గుండె కోత మిగిల్చింది. 

ఫైనల్లో భారత్‌ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ పలువురు నిపుణులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒత్తిడి, టాస్‌ ఓడిపోవడమే టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలని మెజారిటీ శాతం అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం పిచ్‌ విషయంలో బీసీసీఐ చేసిన అతే కొంపముంచిందని అంటున్నారు. తమ పేసర్లు భీకరమైన ఫామ్‌లో ఉన్నప్పుడు నిదానమైన ట్రాక్‌ రూపొందించడమే పెద్ద తప్పని అభిప్రాయపడుతున్నారు. పిచ్‌ విషయంలో బీసీసీఐ వ్యూహం బెడిసికొట్టిందని, అదే మనపై ప్రత్యర్ధి పైచేయి సాధించేలా చేసిందని అంటున్నారు. 

పిచ్‌ ఎప్పటిలాగే ఉన్నా టీమిండియాకు లబ్ది చేకూరేదే అని అభిప్రాయపడుతున్నారు. మన పేసర్లపై నమ్మకం లేక స్లో పిచ్‌ను తయారు చేశారా అని ప్రశ్నిస్తున్నారు. జట్టు అన్ని విభాగాల్లో (బ్యాటింగ్‌, స్పిన్‌ బౌలింగ్‌, పేస్‌ బౌలింగ్‌) పటిష్టంగా ఉన్నప్పుడు నిదానమైన పిచ్‌ను తయారు చేయడంలో అర్ధం లేదని మండిపడుతున్నారు. పిచ్‌ విషయంలో బీసీసీఐ వ్యూహం మిస్‌ ఫైర్‌ అయ్యిందని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ కూడా అన్నాడు. పిచ్‌ స్లోగా ఉండటం, ఆదిలోనే వికెట్లు కోల్పోవడం వల్ల టీమిండియా తీవ్ర ఒత్తిడికి లోనైందని తెలిపాడు. షాట్లు ఆడేందుకు భారత బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డారని అభిప్రాయపడ్డాడు.  

కాగా, అహ్మదాబాద్‌ పిచ్‌పై గతంలో పరుగుల వరద పారిన విషయం తెలిసిందే. ఇక్కడి రెగ్యులర్‌ పిచ్‌పై అత్యంత భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే వరల్డ్‌కప్‌ ఫైనల్లో రెగ్యులర్‌ వికెట్‌ కాకుండా స్లో ట్రాక్‌ను రూపొందించడంతో టీమిండియా పరుగులు చేసేందుకు నానా ఇబ్బందులు పడి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. అనంతరం ఛేదనలో మంచు ప్రభావం చేత పిచ్‌ మరింత నిదానంగా మారి, దాదాపు నిర్జీవమైన పిచ్‌గా మారిపోయింది. ఫలితంగా ఆసీస్‌ బ్యాటర్లు హెడ్‌, లబూషేన్ క్రీజ్‌లో పాతుకుపోయి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement