శనివారం కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకుంటున్న భారత క్రికెటర్ శుబ్‌మన్ గిల్
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొనేందుకు ఇంగ్లండ్‌కు బయలుదేరే భారత జట్టుకు బీసీసీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో ఆటగాళ్లు కరోనా బారిన పడకుండా ఉండేందుకు బీసీసీఐ కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో టీమిండియా 14 రోజుల కఠిన క్వారంటైన్‌ను పూర్తి చేయాల్సి ఉంది.
అయితే అంతకంటే ముందు వీరంతా తమ ఇంటి వద్దే మూడుసార్లు ఆర్‌టీ–పీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా బీసీసీఐ ఆదేశించింది. అందులో ప్రతీసారి నెగెటివ్ అని తేలితేనే ఈ నెల 19 నుంచి ఆరంభమయ్యే క్వారంటైన్‌కు అనుమతి లభిస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. క్వారంటైన్ పూర్తయ్యాక జూన్ 2న ఇంగ్లండ్‌కు భారత జట్టు పయనం కానుంది. ఈ పర్యటనలో పాల్గొనే భారత ఆటగాళ్లందరూ ఇప్పటికే కోవిడ్–19 వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకోగా... రెండో డోస్‌ను ఇంగ్లండ్‌లో తీసుకునేలా బీసీసీఐ ఏర్పాట్లు చేయనుంది.
సాహా, ప్రసి«ధ్ కృష్ణల పరిస్థితేంటి?
ఐపీఎల్ బయో బబుల్‌లో ఉంటూ కరోనా పాజిటివ్‌గా తేలిన సన్‌రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, తన ఇంటికి చేరుకున్నాక వైరస్ బారిన పడ్డ ప్రసి«ధ్ కృష్ణల పరిస్థితి అయోమయంగా ఉంది. అందుకు కారణం వారికి ఇంకా నెగెటివ్ రిపోర్టు రాకపోవడమే. సాహా రెండో వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్‌కు వెళ్లే జట్టులో స్థానం పొందగా... స్టాండ్ బై బౌలర్‌గా ప్రసిధ్ ఎంపికయ్యాడు. తాజాగా సాహాకు నిర్వహించిన రెండు కరోనా పరీక్షల్లో ఒక దాంట్లో నెగెటివ్ అని మరో దాంట్లో పాజిటివ్ అని తేలింది. దాంతో అతను క్వారంటైన్‌లోనే మరికొన్ని రోజులు ఉండాల్సి ఉంది. ప్రసి«ధ్ కూడా ఇంకా తన క్వారంటైన్‌ను పూర్తి చేయలేదు. మే 25లోపు వీరిద్దరూ ముంబైలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. లేకపోతే ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యే అవకాశం ఉంది.
వ్యాక్సిన్ వేసుకునేందుకు భయపడ్డారు
ఐపీఎల్‌కు సంబంధించిన మరో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యాక్సిన్‌పై అపో హలతో పలువురు భారత క్రికెటర్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడ్డారని సమాచారం. సీజన్ ఆరంభానికంటే ముందుగా పలు ఫ్రాంచైజీలు వ్యాక్సిన్ డోస్‌లను ఏర్పాటు చేస్తామని తమ ఆటగాళ్లకు తెలియజేసినా... వాటిని వేయించుకోవడానికి నిరాకరించినట్లు తెలిసింది. టీకా తీసుకుంటే జ్వరం వస్తుందనే భావనలో కొందరు... బయో బబుల్‌లో ఉండగా వ్యాక్సిన్ ఎందుకని మరి కొందరు వాటికి దూరంగా ఉన్నట్లు తెలిసింది. ప్లేయర్లు వ్యాక్సిన్‌పై అయిష్టతతో ఉండటంతో... తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ వారిపై ఫ్రాంచైజీ యాజమాన్యాలు కూడా ఒత్తిడి చేయలేకపోయాయని సమాచారం.
మైక్ హస్సీకి ఊరట...
కరోనా నుంచి కోలుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీకి ఊరట లభించింది. కరోనా నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించిన నిషేధం ఈ నెల 15వ తేదీతో ముగిసింది. దాంతో హస్సీ ఆస్ట్రేలియాకు ఇక్కడి నుంచి నేరుగా వెళ్లే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment