మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా జట్టు ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇటీవల మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో అద్భుతమైన విజయం సాధించడంతో భారత క్రికెట్ జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. రెండో టెస్టుకు మూడో టెస్టుకు మధ్య సమయం చాలా ఉండటంతో ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. దాంతో టీమిండియా ఆటగాళ్లు బయో బబుల్ నిబంధనలు పాటిస్తూనే మెల్‌బోర్న్ నగరంలో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు క్రికెటర్లు మెల్‌బోర్న్‌లోని ఒక హోటల్‌కు వెళ్లి నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ చేసుకుని తిన్నారు. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, నవ్‌దీప్ సైనీ, పృథ్వీ షాలు హోటల్‌కు వెళ్లిన వారిలో ఉన్నారు. ఇదే వారిని ఇరకాటంలో పడేసింది. వీరిని ఐసోలేషన్‌లోకి వెళ్లేలా చేసింది. (వైరల్ : క్రికెటర్ల బిల్లు చెల్లించిన అభిమాని)
ఇంతకీ ఏం జరిగిందంటే.. వీరంతా ఫుడ్ ఆరగించేసే సమయంలో బిల్లును ఒక అభిమాని చెల్లించాడు. ఆ క్రికెటర్ల బిల్లు ఎంత అయ్యిందని తెలుసుకుని మరీ కౌంటర్‌లో కట్టేశాడు. క్రికెటర్లకు తెలియకుండా 118 ఆస్ట్రేలియన్ డాలర్లు( రూ. 6700) బిల్లు కట్టాడు. అయితే బిల్లు చెల్లించడానికి కౌంటర్ వద్దకు వచ్చిన క్రికెటర్లకు మీ బిల్లును ఆ వ్యక్తి కట్టాడంటూ నవల్‌దీప్ సింగ్ వైపు చూపించారు దీంతో రోహిత్ శర్మ, పంత్‌లు నవల్‌దీప్ వద్దకు వచ్చి డబ్బు ఇవ్వబోయారు. అయితే నవల్‌దీప్ అందుకు అభ్యంతరం చెప్పి డబ్బు తీసుకోలేదు. దాంతో అతనికి థాంక్స్ చెప్పారు. కానీ పంత్.. అతన్ని హగ్ చేసుకున్నాడట. కాగా, సీఏ సూచించిన కొన్ని హోటల్‌కు వెళ్లాడానికి అనుమతులున్నాయి. కానీ సదరు అభిమానితో క్లోజ్‌గా ఉండటంతో పాటు హోటల్ బయట కూర్చొన్నప్పుడు కూడా మాస్కులు ధరించలేదని విషయం సీఏ దృష్టికి వచ్చింది. దాంతో పంత్‌తో పాటు అతనితో ఉన్న క్రికెటర్లను ఐసోలేషన్‌లో ఉంచాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశించింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి తెలియజేసింది. దీనికి టీమ్ మేనేజ్‌మెంట్ అంగీకరించడంతో వారంతా ముందుగానే సిడ్నీకి చేరుకుని ఐసోలేషన్‌లో ఉండనున్నారు. వీరికి విడిగా శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment