అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌కు మొదటిరోజే ఆటంకం కలిగింది. వర్షం తాలూకు ప్రభావం కారణంగా ఒక్క బంతి పడకుండానే తొలి రోజు ఆట ముగిసిపోయింది. ఫలితంగా మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించాలనుకున్న ఇరుజట్లకు చేదు అనుభవమే మిగిలింది.
మూడింట విజయాలు
కాగా 2017లో టెస్టు జట్టు హోదా పొందిన అఫ్గనిస్తాన్... ఇప్పటి వరకు సంప్రదాయ ఫార్మాట్లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడింది. టీమిండియాతో ఒకటి, ఐర్లాండ్‌తో రెండు, బంగ్లాదేశ్‌తో రెండు, వెస్టిండీస్‌తో ఒకటి, జింబాబ్వేతో రెండు, శ్రీలంకతో ఒక టెస్టులో పాల్గొంది. వీటిలో జింబాబ్వే, ఐర్లాండ్, బంగ్లాదేశ్‌లపై ఒక్కో మ్యాచ్‌లో గెలుపొందింది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆడేందుకు సిద్ధమైంది.
ఆటగాళ్ల క్షేమమే ముఖ్యం
తమదేశంలో ఇందుకు అనుకూల పరిస్థితులు లేని నేపథ్యంలో భారత్ వేదికగా కివీస్‌తో పోటీకి అన్నిరకాలుగా సన్నద్ధమైంది. గ్రేటర్ నోయిడాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌లో సోమవారం ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, గత రెండు వారాలుగా నోయిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అవుట్‌ఫీల్డ్ మొత్తం పూర్తిగా తడిచిపోయింది. ఈరోజు కాస్త ఎండగానే ఉన్నా.. అవుట్‌ఫీల్డ్ మాత్రం పూర్తిగా ఆరలేదు.
రోజుకొక అరగంట ఎక్కువ?
గ్రౌండ్స్‌మెన్ తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ నిర్వహిస్తే.. ఫీల్డింగ్ సమయంలో ఆటగాళ్లు జారిపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతను దృష్ట్యా తొలిరోజు ఆట రద్దు చేస్తున్నట్లు అంపైర్లు కుమార్ ధర్మసేన, షర్ఫూద్దౌలా తెలిపారు. రేపటి నుంచి నాలుగురోజుల పాటు మ్యాచ్‌ను నిర్వహిస్తామని వెల్లడించారు.
అనూహ్య పరిస్థితుల్లో తొలిరోజు ఆట రద్దైన కారణంగా మిగిలిన నాలుగు రోజులు అరగంట ఎక్కువసేపు ఆట కొనసాగిస్తామని తెలిపారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు ఆట మొదలవుతుందని పేర్కొన్నారు. కాగా స్టార్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ గాయం కారణంగా కివీస్‌తో టెస్టుకు దూరమయ్యాడు.
న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టు
హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మత్ షా, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, అఫ్సర్ జజాయ్, ఇక్రం అలిఖిల్, బహీర్ షా మహబూబ్, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షామ్స్ ఉర్ రహమాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, జహీర్ ఖాన్ పక్తీన్, కైస్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నిజత్ మసూద్.
అఫ్గన్‌తో టెస్టు మ్యాచ్‌కు న్యూజిలాండ్ జట్టు
టామ్ లాథమ్(వికెట్ కీపర్), టిమ్ సౌతీ(కెప్టెన్), డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, అజాజ్ పటేల్, మ్యాచ్ హెన్రీ, టామ్ బ్లండెల్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, విలియం ఒరూర్కీ.
The buildup is 🔛!
While we wait for the start of the game, check out these glimpses of the current scenes in Greater Noida. 👍#AfghanAtalan | #GloriousNationVictoriousTeam pic.twitter.com/aLC5SZGoaW— Afghanistan Cricket Board (@ACBofficials) September 9, 2024
Comments
Please login to add a commentAdd a comment