‘‘గత రెండు రోజులుగా నాకు అంతా గందరగోళంగా ఉంది. అసలు ఏం చెప్పాలో.. ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడంలేదు. నా ఆల్‌టైమ్ ఫేవరెట్ క్రికెటర్‌కు నీరాజనం సమర్పించాలా?... లేదంటే.. జీవిత భాగస్వామి కోణంలో ఆలోచించాలా? లేదంటే.. ఫ్యాన్ గర్ల్‌లా ఓ ప్రేమ లేఖను రాయాలా?.. లేదా ఈ భావోద్వేగాల సమాహారాన్ని పూసగుచ్చాలా?!
అశ్విన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినపుడు చిన్నా, పెద్దా.. అన్ని జ్ఞాపకాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. గత 13- 14 ఏళ్లుగా ఎన్నో అనుభవాలు చవిచూశాం. అతిపెద్ద విజయాలు, ఎన్నెన్నో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు, ఓటమి ఎదురైనపుడు గదిలో నిశ్శబ్దాలు, మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ బోర్డు మీద రాసే రాతలు.. ఇలాంటి జ్ఞాపకాలెన్నో గుర్తుకువస్తున్నాయి.
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో విజయం, సిడ్నీ డ్రా, గబ్బా గెలుపు... టీ20లలో పునరాగమనం.. వీటన్నింటి వల్ల మేము పొందిన ఆనందం అనిర్వచనీయం. అదే సమయంలో ఓటముల వల్ల మా హృదయం ముక్కలైనపుడు ఉండే భయంకర నిశ్శబ్దం కూడా నాకు గుర్తే.
ప్రియమైన అశ్విన్.. నాకైతే మొదట్లో క్రికెట్ కిట్ బ్యాగ్ ఎలా సర్దాలో కూడా తెలిసేదే కాదు. నీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నాకు క్రికెట్ ప్రపంచాన్ని పరిచయం చేసింది నువ్వే. ఆట పట్ల కూడా ప్రేమను కలిగించావు. నీ ప్యాషన్, క్రమశిక్షణ, కఠిన శ్రమ.. వీటన్నింటికి మరేదీ సాటిరాదు.
అత్యుత్తమ గణాంకాలు, అరుదైన రికార్డులు, లెక్కలేనన్ని అవార్డులు.. అయినా సరే ప్రతిసారి మ్యాచ్‌కు ముందు నువ్వు సన్నద్ధమయ్యే తీరు, నీ నైపుణ్యాలకు మెరుగులు దిద్దే విధానం గురించి ఎలా వర్ణించను?..
నీ అంతర్జాతీయ కెరీర్ అత్యద్భుతంగా సాగింది. ఇక నీ మీద ఉన్న భారాన్ని దించుకునే సమయం వచ్చింది. నీకు ఇష్టమైన రీతిలో కొత్త జీవితాన్ని గడుపు. నచ్చిన భోజనం తిను. కుటుంబానికి కూడా కాస్త సమయం కేటాయించు. మన పిల్లలను ఇంకాస్త జాగ్రత్తగా చూసుకో’’.... అంటూ ప్రీతి నారాయణన్ భావోద్వేగానికి లోనయ్యారు. టీమిండియా తాజా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సతీమణే ప్రీతి.
తొలి స్పందన.. ఉద్వేగపూరిత నోట్ వైరల్
అంతర్జాతీయ క్రికెట్‌కు తన భర్త రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రీతి ఈ మేర ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశారు. అశూ ఇకపై తమకు మరింత దగ్గరగా ఉంటాడని భార్యగా ఆనందపడుతూనే.. మరోవైపు అభిమానిగా విచారం వ్యక్తం చేశారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తర్వాత అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
అయితే, టెస్టు క్రికెట్ రారాజుగా వెలుగొందిన అశూ అన్నకు సరైన వీడ్కోలు లభించలేదన్నది వాస్తవం. బ్రిస్బేన్‌లో టెస్టు డ్రా గా ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మకతో కలిసి ప్రెస్‌మీట్‌కు వచ్చిన అశూ తన నిర్ణయాన్ని చెప్పి నిష్క్రమించాడు.
ఎందుకింత అకస్మాత్తుగా?
ఈ నేపథ్యంలో.. అశ్విన్ ఆకస్మికంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. మేనేజ్‌మెంట్ పట్ల అసంతృప్తితోనే అతడు గుడ్‌బై చెప్పాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో 537, వన్డేల్లో 156, టీ20లలో 72 వికెట్లు తీసిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అశ్విన్.. ఆయా ఫార్మాట్లలో 3503, 707, 184 పరుగులు సాధించాడు.
ఇక అశ్విన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 2011, నవంబరు 13న చిరకాల ప్రేయసి ప్రీతి నారాయణన్‌ను చెన్నైలో వివాహమాడాడు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు అఖీరా అశ్విన్(2015), ఆద్యా అశ్విన్(2016).
Comments
Please login to add a commentAdd a comment