అజింక్యా రహానే కొన్నేళ్లుగా టీమిండియా తరపున టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతూ వచ్చాడు. గతేడాది సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో దారుణ వైఫల్యం తర్వాత రహానే జట్టులో చోటు కోల్పోయాడు. అయితే రహానే పెద్దగా ఏం బాధపడలేదు. ఏదో ఒకరోజు అవకాశం తనను వెతుక్కుంటూ వస్తుందని భావించాడు. అయితే ఐపీఎల్‌ను అందుకు మూలంగా మార్చుకున్నాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కే తరపున ఆడిన రహానే ఎవరు ఊహించని రీతిలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రహానే.. ఆ తర్వాత వరుసగా 14 మ్యాచ్‌లాడి 172.49 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు సాధించాడు.ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి.
ఈ ప్రదర్శన రహానేను తిరిగి టీమిండియా జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు తుది జట్టులో చోటు సంపాదించాడు. ఒకప్పుడు రెగ్యులర్ టెస్టు బ్యాటర్ అయిన రహానే శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీతో మరోసారి బ్యాటింగ్‌లో కీలకం కానున్నాడు. ఇక టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని ఓవల్ స్టేడియం వేదికగా జూన్ ఏడు నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.
రహానేను ఊరిస్తున్న రికార్డులు..
ఈ నేపథ్యంలోనే రహానే ముందు పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న రహానే ఈ రికార్డులు బద్దలు కొట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇప్పటి వరకు టీమిండియా తరపున 82 టెస్టులాడిన రహానే 4931 పరుగులు చేశాడు. మరో 69 పరుగులు చేస్తే టెస్టు క్రికెట్‌లో 5వేల పరుగుల మార్క్ అందుకుంటాడు. రహానే ఖాతాలో టెస్టుల్లో 12 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీమిండియా అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రహానే.. ఇప్పటి వరకు ఆడిన 82 మ్యాచ్‌ల్లో 99 క్యాచ్‌లు పట్టాడు. మరొకటి పడితే వంద క్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు. ఇక రహానే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 12,865 పరుగులు చేశాడు. మరో 135 పరుగులు చేస్తే 13వేల పరుగులు సాధించినట్లవుతుంది.
ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్ ఇప్పుడు మళ్లీ ఆసీస్‌తోనే ఫైనల్ ఆడనుంది. ఈ ఫైనల్ కోసం టీమిండియా మూడు బ్యాచ్‌లుగా లండన్‌కు చేరుకుంది. చివరి బ్యాచ్‌లో అజింక్యా రహానేతో పాటు కేఎస్ భరత్, శుభ్‌మాన్ గిల్, షమీ, రవీంద్ర జడేజాలు వచ్చారు. వీరంతా ఐపీఎల్ ఫైనల్ ఆడిన సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్‌లో సభ్యులు.
మరోవైపు ఐపీఎల్ తర్వాత.. యువ ఆటగాళ్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ లో చోటు దక్కింది. తాజా రిపోర్టుల ప్రకారం రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మరొకరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌ను రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంచుకున్నారు. ఎందుకంటే గైక్వాడ్‌కు జూన్ 3న వివాహం జరగబోతుంది. ఈ కారణంగా అతడు భారత జట్టుతో జూన్ 5 తర్వాతే కలవనున్నాడు. దీంతో అతడి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వికి అవకాశం కల్పించారు సెలక్టర్లు. స్టాండ్ బై ప్లేయర్స్ లిస్టులో జైస్వాల్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment