అమెరికా స్విమ్మర్ కేటీ లెడెకీ అరుదైన ఘనత
అత్యధిక ఒలింపిక్ పతకాలు నెగ్గిన మహిళా స్విమ్మర్‌గా రికార్డు
పారిస్: అమెరికా మహిళా స్విమ్మర్ కేటీ లెడెకీ విశ్వ క్రీడల్లో మరోసారి మెరిసింది. 4్ఠ200 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కేటీ లెడెకీ, క్లెయిర్ వీన్‌స్టెన్, పెయిజ్ మాడెన్, ఎరిన్ గిమెల్‌లతో కూడిన అమెరికా బృందం రజత పతకం (7ని:40.86 సెకన్లు) సాధించింది. తాజా ఒలింపిక్స్‌లో ఇప్పటికే మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో స్వర్ణం, మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో కాంస్యం గెలిచిన లెడెకీకిది మూడో పతకం కాగా... 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో ఆమె బరిలోకి దిగాల్సి ఉంది.
తాజా పతకంతో లెడెకీ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 13 పతకాలు గెలిచిన మహిళా స్విమ్మర్‌గా చరిత్ర లిఖించింది. 12 పతకాలతో జెన్నీ థాంప్సన్ (అమెరికా) పేరిట ఉన్న రికార్డును లెడెకీ సవరించింది. వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న లెడెకీ ఇప్పటి వరకు విశ్వక్రీడల్లో 8 స్వర్ణాలు, 4 రజతాలు, ఒక కాంస్యం సాధించింది.
ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో అమెరికా మాజీ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ అత్యధికంగా 28 పతకాలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 13 పతకాలతో లెడెకీ మహిళల విభాగంలో అగ్రస్థానంలో, ఓవరాల్‌గా రెండో స్థానంలో ఉంది. ‘విశ్వక్రీడల్లో ఒత్తిడి సహజమే. అయితే నా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా పెట్టుకుంటా. ఆ క్రమంలో రికార్డులు నమోదైతే అది మరింత ఆనందం. స్వదేశంలో జరిగే 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లోనూ పాల్గొంటా’ అని లెడెకీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment