కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలిరా.. అన్నట్టు హుషారుగా బ్యాట్ ఝుళిపించారు. పరుగుల వరద పారించారు. భళా అనిపించారు.. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఆంధ్రప్రదేశ్ వీల్‌చైర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తెలంగాణ జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీల్లో దివ్యాంగుల క్రీడోత్సాహ దృశ్యాలివి.
రాజమహేంద్రవరం రూరల్: చిన్న ఓటమి, అపజయానికే తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్న నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దివ్యాంగ క్రీడాకారులు. అంగ వైకల్యంతో కుంగిపోకుండా, పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తమకు ఇష్టమైన క్రికెట్‌లో సత్తా చాటుతున్నారు. ఆర్థికంగా కష్టమైనా, సౌకర్యాలు తక్కువగా ఉన్నా వీల్ చైర్ క్రికెట్‌లో సాధన చేసి అనుకున్నది సాధించారు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి చేరారు. త్వరలో ఐడబ్ల్యూపీఎల్ (ఇండియన్ వీల్‌చైర్ ప్రీమియర్ లీగ్)లో ఆడనున్నట్లు సంతోషంగా చెబుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాకు చెందిన వీల్‌చైర్ క్రికెట్ క్రీడాకారులు.
సాధారణ క్రికెట్ మాదిరిగానే వీల్‌చైర్ క్రికెట్ కూడా ఉంటుంది. జట్టులో 11 మంది క్రీడాకారులు ఉంటారు. బౌలింగ్, బ్యాటింగ్, కీపింగ్, ఫీల్డింగ్ అంతా వీల్‌చైర్‌లో ఉంటూనే చేస్తారు. సాధారణ క్రికెటర్లు పరిగెత్తినట్టుగా మైదానంలో వీల్ చైర్‌లో తిరుగుతూ ఆడతారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో జరుగుతున్న వీల్‌చైర్ క్రికెట్ పోటీలలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బాలుర హైస్కూల్ క్రీడాప్రాంగణంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ వీల్‌చైర్ క్రికెట్ టోర్నమెంట్‌లో తలపడుతున్నారు. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయి.
ధృడ సంకల్పం
ధృడ సంకల్పం ఉంటే ఎంత కష్టమైన పనిలోనైనా విజయం సాధించవచ్చని వీల్‌చైర్ క్రికెట్ క్రీడాకారులు నిరూపిస్తున్నారు. వీల్‌చైర్‌లోనే క్రికెట్ ఆడుతూ క్రీడలపై తమకు ఉన్న మక్కువను చూపుతున్నారు. బంతిని అందుకునే సమయంలో క్రీడాకారులు అదుపుతప్పి పడిపోయినట్లే ఒక్కోసారి వీరుకూడా వీల్‌చైర్ నుంచి కింద పడిపోతారు. అయినా మొక్కవోని దీక్షతో తమ సత్తా చాటుతున్నారు.
సత్తా చాటుతాం
జాతీయస్థాయి వీల్‌చైర్ క్రికెట్‌లో సైతం సత్తా చాటుతాం. రెండేళ్లుగా ముమ్మర సాధన చేస్తున్నాం. త్వరలో జరిగే ఇండియన్ వీల్‌చైర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు పాల్గొంటున్నారు. పిడింగొయ్యి పంచాయతీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నా. ఖాళీ సమయంలో వీల్‌చైర్ క్రికెట్ సాధన చేస్తున్నాను. హైదరాబాద్‌లో జరిగిన టోర్నమెంట్‌లో ఆంధ్రా జట్టు రన్నర్‌గా నిలిచింది.
– మానుపాటి ప్రవీణ్ కుమార్, ఏపీ వీల్‌చైర్ క్రికెట్ టీమ్ కెప్టెన్
క్రికెట్‌పై మక్కువ
అంగవైకల్యం ఉన్నా ఏరోజూ కుంగిపోలేదు. ఆటపై ఉన్న మక్కువతో వీల్ చైర్ క్రికెట్‌లో సాధన చేశాం. పలువురు అందించిన ప్రోత్సాహంతో అనేక రాష్ట్రాలలో క్రికెట్ ఆడాను. బ్యాటింగ్‌లో మంచి స్కోర్‌ను సాధించగలిగాను. టీమ్ సమష్టి కృషితో ముంబైలో జరిగిన టోర్నమెంట్‌లో రన్నర్‌గా నిలిచాం. మరింత సాధన చేసి జాతీయ టీమ్‌లో స్థానం సంపాదించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాను.
– ఎస్‌కే సమీయుద్దీన్, తెలంగాణ వీల్‌చైర్ క్రికెట్ టీమ్ కెప్టెన్
ప్రోత్సాహం బాగుంది
వీల్‌చైర్ క్రికెట్‌లో రాణిస్తున్నాం. క్రికెట్ ఆడేందుకు మాకు వైకల్యం అడ్డుకాలేదు. ఆత్మవిశ్వాసంతో క్రమశిక్షణ తో సాధన చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఒడిశాను ఉత్తమ జట్టుగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం. ఆంధ్రాలో జరుగుతున్న మ్యాచ్‌లో విజయం సాధించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. వీల్‌చైర్ క్రికెట్‌కు వస్తున్న ప్రోత్సాహంతోనే ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్లి ఆడుతున్నాం.
– అభయ్, ఒడిశా వీల్‌చైర్ క్రికెట్ టీమ్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment