భారీ విజయంతో ముగింపు
దక్కని క్వార్టర్ ఫైనల్ బెర్త్
సాక్షి, హైదరాబాద్: ప్రత్యర్థి జట్టుపై గోల్స్ వర్షం కురిపించినా... జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు నాకౌట్ దశకు చేరుకోలేకపోయింది. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ జట్టు లీగ్ దశలోనే వెనుదిరిగింది.
సోమవారం జరిగిన చివరిదైన గ్రూప్ ‘హెచ్’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు 26–1 గోల్స్ తేడాతో పుదుచ్చేరి జట్టుపై భారీ విజయం నమోదు చేసుకుంది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘హెచ్’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన మధ్యప్రదేశ్ జట్టు అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది.
లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక ఎనిమిది గ్రూపుల్లో టాప్ స్థానంలో నిలిచిన ఎనిమిది జట్లు (హరియాణా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మిజోరం, ఢిల్లీ, పంజాబ్, మధ్యప్రదేశ్) క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఉత్తరప్రదేశ్‌తో మిజోరం; మహారాష్ట్రతో జార్ఖండ్; మధ్యప్రదేశ్‌తో హరియాణా; ఒడిశాతో ఢిల్లీ తలపడతాయి.
తులసీ 9 గోల్స్...
పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు ఆరంభం నుంచే అదరగొట్టారు. 6వ నిమిషంలో మొదలైన గోల్స్ వేట 56వ నిమిషం వరకు కొనసాగింది. ఏపీ అమ్మాయిలు అవకాశం దొరికినపుడల్లా పుదుచ్చేరి గోల్ పోస్ట్‌పై దాడులు చేసి అనుకున్న ఫలితం సాధించారు. ముఖ్యంగా కెపె్టన్ కుప్పా తులసీ చెలరేగిపోయింది. ఆమె ఏకంగా 9 గోల్స్ సాధించి అబ్బురపరిచింది.
తులసీ 6వ, 12వ, 21వ, 23వ, 32వ, 33వ, 34వ, 43వ, 56వ నిమిషాల్లో గోల్స్ కొట్టింది. పూజారి మధురిమ బాయి నాలుగు గోల్స్ (26వ, 39వ, 42వ, 47వ నిమిషాల్లో), మునిపల్లి నాగనందిని నాలుగు గోల్స్ (16వ, 28వ, 29వ, 54వ నిమిషాల్లో), పరికి లక్ష్మి మూడు గోల్స్ (8వ, 32వ, 37వ నిమిషాల్లో), చిల్లూరు నాగతేజ రెండు గోల్స్ (14వ, 24వ నిమిషాల్లో), మండల వైష్ణవి (19వ, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్, ముజియా బేగం పఠాన్ (11వ నిమిషంలో), తిరుమలశెట్టి జోష్నా (41వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
పుదుచ్చేరి జట్టుకు నిలోవియా (28వ నిమిషంలో) ఏకైక గోల్ అందించింది. సోమవారం జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో మణిపూర్ 5–1తో దాద్రా అండ్ నాగర్ హవేలి అండ్ డమన్ అండ్ డియు జట్టుపై, చండీగఢ్ 3–0తో కేరళపై, పంజాబ్ 9–0తో అస్సాంపై గెలుపొందగా... బిహార్, కర్ణాటక జట్ల మధ్య మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment