విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా క్రికెటర్లు ప్రతిభను ప్రదర్శించేందుకే ఏపీఎల్ ప్లాట్‌ఫాం కానుందని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు శరత్‌చంద్రరెడ్డి పేర్కొన్నారు. బీసీసీఐ సహకారంతో ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) రెండో సీజన్‌ను బుధవారం వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర తరపున పలు కేటగిరిల్లో యువ క్రీడాకారులు ఆడుతున్నారని.. వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ప్రోత్సహించడమే ఏపీఎల్ ముఖ్య ఉద్దేశమన్నారు.
రాష్ట్ర ఐటీ మంత్రి అమర్‌నాథ్ మాట్లాడుతూ అక్టోబర్ 2 నుంచి ఏపీలోని ప్రతీ గ్రామ, వార్డులో ఔత్సాహిక ఆటగాళ్లను ప్రోత్సహించే విధంగా ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారన్నారు. ఈ పోటీల్లో 15 వేలకు పైగా జట్లు ఎంపిక చేసిన క్రీడల్లో పోటీపడనున్నాయన్నారు. తొలుత అతిథిగా హాజరైన సినీ నటి శ్రీలీల ఆయా జట్ల ఫ్రాంచైజీ అధినేతలు, కెప్టెన్‌లతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.
ఈ కార్యక్రమంలో వీడీసీఏ అధ్యక్షుడు, కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ మేయర్ హరివెంకటకుమారి, ఏపీఎల్ గవరి్నంగ్ కౌన్సిల్ చైర్మన్ ఫెర్రర్, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథరెడ్డి, ఉపాధ్యక్షుడు రోహిత్‌రెడ్డి, ఏపీఎల్ గవరి్నంగ్ కౌన్సిల్ సభ్యులు, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కోస్టల్ రైడర్స్–బెజవాడ టైగర్స్ జట్ల మధ్య పోరుతో ఈ సీజన్ ఆరంభమైంది. శరత్ చంద్రరెడ్డి టాస్ వేశారు. బెజవాడ టైగర్స్ జట్టుపై కోస్టల్ రైడర్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది.
అభిమానుల సందడి
ఏపీఎల్–2 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలుత విజేతలకు అందించే ట్రోఫీతో ఆరుజట్ల ఫ్రాంచైజీ యజమానులు, కెపె్టన్లు ఫొటో సెషన్ నిర్వహించారు. సినీ నటి శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఐపీఎల్ తరహాలో చీర్ గాళ్స్ సైతం బౌండరీలు, వికెట్లు పడినప్పుడు అభిమానులను ఉత్సాహపరిచారు. స్టేడియంలో అభిమానుల సందడి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment