విశాఖ స్పోర్ట్స్ : కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ ఏపీఎల్ తొలి సీజన్ ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. లీగ్ చివరి మ్యాచ్‌లో ఆధిక్యానికి పోటీపడ్డ బెజవాడ టైగర్స్‌ను నిలువరించి కోస్టల్ రైడర్స్ ప్లేఆఫ్‌కు చేరింది. ఇప్పటికే టైగర్స్ ప్లేఆఫ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్లు 12 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్త్‌లు కన్ఫర్మ్ చేసుకున్నాయి.
మ్యాచ్ సాగిందిలా!
వైఎస్సార్ స్టేడియంలో తొలుత టాస్ గెలిచిన కోస్టల్ రైడర్స్ కెప్టెన్ జ్ఞానేశ్వర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జ్ఞానేశ్వర్‌తో కలిసి తొలి వికెట్‌కు ఓపెనర్ మునీష్ 15 పరుగులు చేసి 23 పరుగుల వద్ద లలిత్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం బరిలో దిగిన హర్షవర్ధన్ కెప్టెన్ జ్ఙానేశ్వర్‌తో కలిసి పరుగుల వరద పారించాడు.
ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు నమోదు చేశారు. భారీస్కోర్ దిశగా సాగుతుండగా జ్ఙానేశ్వర్ (52).. రికీబుయ్ బౌలింగ్‌లో డీప్‌మిడ్ వికెట్‌లో అవినాష్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కీపర్ బ్యాటర్ లేఖజ్‌తో కలిసి స్కోరును 168 పురుగులకు చేర్చారు.
హర్షవర్ధన్ (63) పరుగులు చేసి సాయితేజ బౌలింగ్‌లో సుమంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరో రెండు బంతుల అనంతరం లేఖజ్ (33)అయ్యప్పకు లెగ్‌బిఫోర్‌గా దొరికిపోయాడు. శ్రీనివాస్ (10), తపస్వి(3) అజేయంగా నిలిచి స్కోర్‌ను నాలుగు వికెట్లకు 181 పరుగులకు చేర్చారు. అయ్యప్ప, సాయితేజ, లలిత్, రికీబుయ్ ఒకో వికెట్ తీశారు.
తడబడిన టైగర్స్..
దీటుగానే ఆట ప్రారంభించిన బెజవాడ టైగర్స్ తొలి రెండు వికెట్లను కోల్పోయినా తొలి పదిఓవర్లు టాప్ ఆర్డర్ కొనసాగింది. 50 పరుగుల వద్ద ఓపెనర్ సుమంత్ (24), మరో ఓపెనర్ మహీప్ (28) త్వరగా ఔటయ్యారు. 11వ ఓవర్‌లో ఆశిష్ బౌలింగ్‌లో రెండు వరుస బంతుల్లో కెప్టెన్ రికీబుయ్ (6), మనీష్(0) పెవిలియన్‌కు చేరుకోవడంతో ఒక్కసారిగా ఆటపై కోస్టల్ రైడర్స్ పట్టు సాధించింది.
అప్పటి వరకు నిలకడగా ఆడుతున్న ప్రణీత్ సైతం (30)తపస్వి బౌలింగ్‌లో విజయ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరగడంతో వంద పరుగుల మార్కు చేరుకోకుండానే టైగర్స్ జట్టు ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్‌లో అవినాష్, జగదీష్ జోడి ఇన్నింగ్స్ సరిదిద్ది 54 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది.
జగదీష్ (27) విజయ్ బౌలింగ్‌లో జ్ఞానేశ్వర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరగ్గా...తొమ్మిది పరుగులు జోడించి రాహుల్ (9),అయ్యప్ప(0)పెవిలియన్‌కు చేరుకున్నారు. మరో రెండు బంతుల్లో ఆట ముగిసే సమయానికి నిలకడగా ఆడుతున్న అవినాష్ (35) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.
చివరికి టైగర్స్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రైడర్స్ జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. హర్షవర్ధన్ మ్యాచ్ బెస్ట్ బాటర్‌గానూ, ఆశీష్ బెస్ట్ బౌలర్‌గా నిలిచారు.
రసవత్తర పోరులో ఉత్తరాంధ్ర లయన్స్ విజయం
గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయన్స్ జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టైటాన్స్ ఓపెనర్ వంశీకృష్ణ ఒక్క పరుగు చేసి భరత్‌కు దొరికిపోయాడు.
ఓపెనర్ హేమంత్‌తో కలిసి నితీష్ రెండో వికెట్‌కు 51పరుగులు జోడించారు. నితీష్ (35) షోయబ్‌కు క్లీన్‌బౌల్డ్ కాగా హేమంత్‌ను (39) 99 పరుగుల వద్ద కౌషిక్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. సందీప్ రెండు ఫోర్లతో 22 పరుగులు చేసి వర్మ బౌలింగ్‌లో లాంగాఫ్‌లో క్రాంతికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ధీరజ్ రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 34పరుగులు చేయడంతో టైటాన్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేయగలిగింది.
ప్రమోద్ మూడు, వర్మ రెండు వికెట్లు తీయగా అజయ్, షోయిబ్, కౌషిక్ ఒకో వికెట్ తీశారు. 150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాంధ్ర లయన్స్ ఓపెనర్లు తొలి ఓవర్‌కే 15 పరుగులు చేశారు. ఓపెనర్ రోహిత్ (10)ని నితీష్ తొలి ఓవర్ (ఇన్నింగ్స్ రెండోఓవర్)నాలుగో బంతిని ఆడబోయి స్క్వేర్‌లెగ్‌లో శశికాంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
ఆ స్థానంలో వచ్చిన గుల్ఫమ్ నాలుగు పరుగులే చేసి రనౌటై వెనుతిరిగాడు. ఈ దశలో ఓపెనర్, కెప్టెన్ భరత్‌కు ధీరజ్ లక్ష్మణ్ తోడై స్కోర్‌ను 50 పరుగులకు చేర్చారు. భరత్ (36).. ఇస్మాయిల్ వేసిన బంతికి ఎక్స్‌ట్రా కవర్‌లో నితీష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
ధీరజ్, క్రాంతి జోడి నిలకడగా ఆడుతూ స్కోర్‌ను పరుగులెత్తించారు. థీరజ్ ఏడు ఫోర్లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం బరిలో దిగిన క్రాంతి (17) సైతం సందీప్‌కు క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో చివరి మూడు ఓవర్లలో నాలుగు వికెట్లకు 25పరుగులు చేయాల్సిన స్థితిలో విజయం దోబూచులాడింది. లోయర్ మిడిలార్డర్‌లో వర్మ 11 పరుగులు చేశాడు.
షోయబ్ (6), రఫీ(11) అజేయంగా నిలిచి మరో ఐదు బంతులుండగానే ఏడు వికెట్లకు 150 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించారు. ఇస్మాయిల్ మూడు, సందీప్ రెండు, నితీష్ ఒక వికెట్ తీశారు. దీంతో మూడు వికెట్ల తేడాతో ఉత్తరాంధ్ర లయన్స్ విజయం సాధించింది. మ్యాచ్ బెస్ట్‌గా నితీష్‌కుమార్ నిలవగా బెస్ట్ బ్యాటర్‌గా ధీరజ్, బెస్ట్ బౌలర్‌గా ఇస్మాయిల్ నిలిచారు.
చదవండి: Ind Vs Eng 1st ODI: టీమిండియా ఆరేళ్ల తర్వాత.. పాపం ఇంగ్లండ్ సొంతగడ్డపై చెత్త రికార్డు!
Latest Womens ODI Rankings: టాప్ 10లో టీమిండియా వైస్ కెప్టెన్.. మెరుగైన కెప్టెన్ ర్యాంక్
Comments
Please login to add a commentAdd a comment